Rohit on Pujara and Rahane: అందుకే పుజారా, రహానేలను కాదని పటీదార్‌ను తీసుకున్నాం: రోహిత్ శర్మ
24 January 2024, 20:27 IST
- Rohit on Pujara and Rahane: సీనియర్ ప్లేయర్స్ పుజారా, రహానేలను కాదని రజత్ పటీదార్ ను కోహ్లి స్థానంలో తీసుకోవడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
పుజారా, రహానేలపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rohit on Pujara and Rahane: ఇంగ్లండ్ తో టీమిండియా గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని విరాట్ కోహ్లి స్థానంలో పుజారా, రహానేలాంటి సీనియర్లను కాకుండా రజత్ పటీదార్ లాంటి యువ బ్యాటర్ ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. అంతేకాదు పుజారా, రహానేల కెరీర్ ఇక ముగిసినట్లు కాదని కూడా అతడు స్పష్టం చేశాడు.
రజత్‌ను అందుకే తీసుకున్నాం
వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి ఇంగ్లండ్ తో తొలి టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతని స్థానంలో సీనియర్ చెతేశ్వర్ పుజారాను తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం యువ బ్యాటర్ రజత్ పటీదార్ కు అవకాశం ఇచ్చారు. తొలి టెస్టుకు ముందు బుధవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. దీని వెనుక కారణాన్ని వివరించాడు.
"చూడండి.. నిజానికి మేము సీనియర్ ప్లేయర్స్ వైపే చూడాలని అనుకున్నాం. కానీ ఈ యువ ప్లేయర్స్ కు ఎప్పుడు అవకాశాలు దొరుకుతాయి చెప్పండి. అదే మేము ఆలోచించాం. నేను కూడా ఆలోచించాను" అని రోహిత్ అన్నాడు. మధ్యప్రదేశ్ కు చెందిన పటీదార్ ఈ మధ్యే ఇండియా ఎ తరఫున ఇంగ్లండ్ లయన్స్ తో మ్యాచ్ లో రాణించాడు. అతడు కేవలం 158 బాల్స్ లో 151 రన్స్ చేశాడు.
దీంతో సెలెక్టర్లు రజత్ వైపు చూశారు. అయితే అంత మాత్రాన సీనియర్ ప్లేయర్స్ పనైపోయినట్లు కాదని కూడా రోహిత్ అన్నాడు. "ఓ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెట్టడం లేదంటే అతన్ని తీసుకోవాలని అనుకోకపోవడం నిజంగా కష్టమైన నిర్ణయమే. వాళ్లు చేసిన రన్స్, వాళ్లకున్న అనుభవం, వాళ్లు గెలిపించిన మ్యాచ్ లను చూస్తే వాళ్లను విస్మరించడం కఠిన నిర్ణయమే.
కానీ కొన్నిసార్లు కొందరు ప్లేయర్స్ ను కూడా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్లకు అనుకూలించే వాతావరణంలో ఆడే అవకాశం ఇచ్చి విదేశీ టూర్లకు సిద్ధం చేయాలి. అందుకే యువకులకు అవకాశం ఇచ్చాం. అంతమాత్రాన ఎవరికీ పూర్తిగా తలుపులు మూసినట్లు కాదు. వాళ్లు ఫిట్ గా ఉండి, రన్స్ చేస్తున్నంత వరకూ తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరినైనా మళ్లీ టీమ్ లోకి తీసుకుంటాం" అని రోహిత్ అన్నాడు.
సీనియర్ బ్యాటర్లు పుజారా, రహానే ఫామ్ కోల్పోవడంతో గతేడాది నుంచి ఇద్దరినీ పక్కన పెట్టారు. ఇండియన్ టీమ్ లో చోటు కోల్పోయిన తర్వాత రంజీ ట్రోఫీలో పుజారా ఆడుతున్నాడు. గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లోనూ ఆడి పరుగుల వరద పారించాడు. ఈ మధ్యే అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 20 వేల రన్స్ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో సచిన్, ద్రవిడ్ లాంటి వాళ్ల సరసన నిలిచాడు.
మరోవైపు తొలి టెస్టులో విరాట్ కోహ్లి స్థానంలో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఓవైపు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించినా.. ఇండియన్ టీమ్ టాస్ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఇంగ్లండ్ తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండటం విశేషం.