Rajat Patidar: కోహ్లి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రజత్ పాటిదార్ అరంగేట్రం ఖాయమేనా - పుజారాకు ఛాన్స్?
Rajat Patidar: ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి మొదలుకానున్న టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి దూరమయ్యాడు. కోహ్లి స్థానాన్ని రజత్ పాటిదార్ లేదా పుజారాలలో ఒకరు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rajat Patidar: ఇంగ్లాండ్‌తో టెస్ట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్ గురువారం (జనవరి 25 నుంచి) మొదలుకానుంది. కాగా ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నట్లు బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ టెస్ట్ మ్యాచ్‌లలో కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కోహ్లి రీప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు.
రజత్ పాటిదార్...
కోహ్లి స్థానంలో ఆర్‌సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇంగ్లాండ్, ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్‌లో 151 పరుగులతో రజత్ పాటిదార్ రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చీలమండ గాయం కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు జట్టుకు దూరమైన రజత్ పాటిదార్ ఇంగ్లాండ్, ఇండియా ఏ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఒకవేళ రజత్ పాటిదార్‌కు ఛాన్స్ దక్కితే ఇదే అతడి అరంగేట్రం టెస్ట్ అవుతుంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు రజత్ పాటిదార్.
గత డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 పరుగులతో నిరాశపరిచాడు. గత ఏడాది విజయ్ హజారే ట్రోపీలో 52 యావరేజ్‌తో 315 రన్స్ చేశాడు.ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పాటిదార్.
పుజారా పోటీ...
కోహ్లి స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు రజత్ పాటిదార్‌తో పాటు సీనియర్ టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా,రింకు సింగ్, సర్ఫరాజ్‌ఖాన్ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది. ఫామ్ లేమి కారణంగా పుజారా ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. గత ఏడాది ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమైన అతడిని సెలెక్టర్లు పక్కనపెట్టారు.
అయితే కోహ్లి దూరం కావడంతో పుజారాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ జట్టు తరఫున విఫలమైన పుజారా కౌంటీలో మాత్రం సెంచరీలతో అదరగొట్టాడు. అతడి అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. పాటిదార్ లేదా పుజారాలలో ఎవరో ఒకరు జట్టులోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
రింకు సింగ్ కూడా...
సర్ఫరాజ్‌ఖాన్ రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. అతడి పేరు పరిశీలనలో ఉన్న అవకాశం దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. రింకు కూడా పేరు కూడా ప్రచారంలో ఉంది. కానీ టీ20లకు తగ్గట్లుగా దూకుడుగా ఆడే రింకు సింగ్ టెస్ట్‌ల్లో ఏ మేరకు రానిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. నలుగురిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఈ రోజు వెల్లడికానున్నట్లు తెలిసింది.