Cheteshwar Pujara: చెతేశ్వర్ పుజారాా కెరీర్ ముగిసినట్టేనా?
Cheteshwar Pujara: వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు సీనియర్ ప్లేయర్ చెతేశ్వర్ పుజారా ఎంపిక కాలేదు. దీంతో అతడి కెరీర్ ముగింపునకు వచ్చిందా అనే పశ్న తలెత్తుతోంది. వివరాలివే..
Cheteshwar Pujara: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍లో టీమిండియా ఓటమి పాలవటంతో కీలక చర్యలకు బీసీసీఐ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు భారత సీనియర్ ప్లేయర్ చెతేశ్వర్ పుజారాను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. విండీస్ గడ్డపై జూలై 12న ఆరంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‍కు ఎంపిక చేసిన భారత జట్టులో నయా వాల్ పుజారాాకు చోటు దక్కలేదు. సెలెక్టర్లు అతడికి ఉద్వాసన పలికారు. టెస్టుల్లోకి ఇద్దరు యువ ఆటగాళ్లను తీసుకున్నారు. మరి, దీంతోనే చెతేశ్వర్ పుజారాా కెరీర్ ముగిసినట్టేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివరాలివే..
2020 నుంచి..
తన సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో చెతేశ్వర్ పుజారా అనేక గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. కొన్ని మ్యాచ్‍ల్లో వీరోచిత పోరాటం చేసి టీమిండియాకు ఓటములు తప్పించాడు. దిగ్గజ రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియాకు నయా వాల్ అనే బిరుదు తెచ్చుకున్నాడు. అయితే, మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2020 నుంచి చెతేశ్వర్ పూజరా ఫామ్‍లో లేడు. 2020 నుంచి 28 టెస్టులు ఆడిన పుజారా కేవలం ఒకేఒక్క సెంచరీ చేశాడు. 52 ఇన్నింగ్స్‌ల్లో 1,455 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కేవలం 29.69 యావరేజ్‍తో నిరాశపరిచాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 27 రన్స్ చేసి ఔటయ్యాడు. చాలా కాలంగా పుజారా నిలకడలేమితో ఉన్నాడు. ఆరంభంలో నిలదొక్కుకున్నట్టు కనిపించినా.. ఔటై పెవిలియన్ చేరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో జట్టుపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో 35 ఏళ్ల పుజారాను తప్పించి వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు యువ ఆటగాళ్లను తీసుకున్నారు సెలెక్టర్లు.
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు పుజారాను ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‍ను టెస్టుల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్‍పైనే అందరి దృష్టి ఉంది.
అదొక్కటే మార్గం
చెతేశ్వర్ పుజారాా మళ్లీ టీమిండియా టెస్టు జట్టులోకి రావాలంటే ఒకే మార్గం మిగిలి ఉంది. దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ మ్యాచ్‍ల్లో అద్భుత ప్రదర్శన చేస్తే పుజారాను సెలెక్టర్లు మళ్లీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని సెలెక్టర్లు ఇప్పటికే పుజారాాకు చెప్పినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఓసారి భారత జట్టు నుంచి ఉద్వాసన గురైన సమయంలో దేశవాళీ క్రికెట్‍లో అదరగొట్టి రీ ఎంట్రీ ఇచ్చాడు పుజారా. అయితే, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే పుజారా వయసు 35 ఏళ్లు దాటింది. మరి ఇప్పుడు దేశవాళీ క్రికెట్‍లో అదరగొట్టి మళ్లీ టీమిండియాలోకి రాగలడా అన్నది చూడాలి.
2010 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు ద్వారా టీమిండియాకు అరంగేట్రం చేశాడు చెతేశ్వర్ పుజారా. ఇప్పటి వరకు 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. 35 అర్ధ శతకాలు, 19 సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 206 పరుగులు (నాటౌట్)గా ఉంది.
జూలై 12న ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‍లకు జట్లను నేడు ప్రకటించింది బీసీసీఐ. టీ20 సిరీస్‍కు త్వరలో టీమ్‍ను ప్రకటించనుంది.
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‍కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయ్‍దేవ్ ఉనాద్కత్, నవ్‍దీప్ సైనీ
వన్డే సిరీస్‍కు..: రోహిత్ (కెప్టెన్), గిల్, రుతురాజ్, కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ , జడేజా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహల్, కుల్‍దీప్ యాదవ్, ఉనాద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్