Ashwin Virat Kohli: ఎంసీజీలో నీతో కలిసి బ్యాటింగ్‌కు వస్తా: విరాట్ కోహ్లి ఎమోషనల్ పోస్టుకు అశ్విన్ రిప్లై
20 December 2024, 11:00 IST
- Ashwin Virat Kohli: విరాట్ కోహ్లి ఎమోషనల్ పోస్టుపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తన రిటైర్మెంట్ పై కోహ్లి చేసిన పోస్టు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అశ్విన్ స్పందిస్తూ.. నీకు చెప్పినట్లే ఎంసీజీతో నీతో కలిసి బ్యాటింగ్ కు వస్తా అని అతడు రిప్లై ఇవ్వడం విశేషం.
ఎంసీజీలో నీతో కలిసి బ్యాటింగ్‌కు వస్తా: విరాట్ కోహ్లి ఎమోషనల్ పోస్టుకు అశ్విన్ రిప్లై
Ashwin Virat Kohli: రవిచంద్రన్ అశ్విన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు సడెన్ గా గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చేసిన విషయం తెలుసు కదా. అతని రిటైర్మెంట్ ప్రకటించిన రోజే విరాట్ కోహ్లి ఓ ట్వీట్ చేశాడు. అతని రిటైర్మెంట్ తనను భావోద్వేగానికి గురి చేసిందని, 14 ఏళ్లపాటు అతనితో కలిసి ఆడిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని కోహ్లి ట్వీట్ చేశాడు. దీనికి తాజాగా శుక్రవారం (డిసెంబర్ 20) అశ్విన్ రిప్లై ఇచ్చాడు.
నీతో బ్యాటింగ్‌కు వస్తా..
అశ్విన్ బౌలింగ్ ను ఫీల్డ్ లో ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని మాటలను ఎదుర్కోవడం కూడా అంతే కష్టం. ఎలాంటి వాళ్లకైనా అప్పటికప్పుడు సమాధానం ఇవ్వడం అతనికి అలవాటు. తాజాగా కోహ్లి చేసిన ఎమోషనల్ పోస్టు కూడా అతడు ఇచ్చిన రిప్లై అలాంటిదే. "నీతో కలిసి నేను 14 ఏళ్లు ఆడాను. నువ్వు రిటైరవుతున్నాని చెప్పగానే అది నన్ను కాస్త భావోద్వేగానికి గురి చేసింది.ఇద్దరం కలిసి ఆడిన రోజులు గుర్తుకు వచ్చాయి. నీతో కలిసి చేసిన ప్రయాణాన్ని నేను బాగా ఆస్వాదించాను. నీ ప్రతిభ, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం అసామాన్యమైంది. ఇండియన్ క్రికెట్ లెజెండ్ గానే నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు" అని కోహ్లి ట్వీట్ చేశాడు.
దీనికి శుక్రవారం (డిసెంబర్ 20) అశ్విన్ రిప్లై ఇచ్చాడు. "థ్యాంక్స్ బడ్డీ.. నేను నీకు చెప్పినట్లుగానే.. ఎంసీజీలో నీతో కలిసి నేను బ్యాటింగ్ కు వస్తా" అని అశ్విన్ అనడం విశేషం. తాను రిటైర్మెంట్ ప్రకటించిన రోజే అశ్విన్ ఆస్ట్రేలియా వదిలి చెన్నై వచ్చేశాడు. అయితే తాను ఉన్నట్లుగానే ఊహించుకో అన్నట్లుగా విరాట్ కు అశ్విన్ సందేశం పంపించాడు. నిజానికి మూడో టెస్టు చివరి రోజు డ్రెస్సింగ్ రూమ్ లో చాలాసేపు విరాట్ కోహ్లితో మాట్లాడాడు అశ్విన్. ఆ వెంటనే కోహ్లి అతనికి హగ్ ఇచ్చాడు. దీంతో అతడు రిటైరవతున్నాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాసేపటికే అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అవమానాలను భరించలేకే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ అతని తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అశ్విన్‌కు అవమానం?
అయితే అశ్విన్ రిటైర్మెంట్ పై మిశ్రమ స్పందన వచ్చింది. అంతటి లెజెండరీ క్రికెటర్ కు సరైన గౌరవం లభించలేదని, సాదాసీదాగా అశ్విన్ రిటైరైపోయాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ సిరీస్ మధ్యలో ఇలా సడెన్ గా నిర్ణయం ప్రకటించడం సరికాదని గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు అన్నారు. మొత్తానికి టెస్టుల్లోనే కాదు ఓవరాల్ గా కూడా టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో కుంబ్లే తర్వాత రెండో స్థానంలో నిలిచిన అశ్విన్ ఓ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్వదేశంలో జడేజాతో కలిసి అతడు చేసిన మ్యాజిక్ ఎప్పటికీ మరచిపోలేం. ఇప్పుడతని ఆఫ్ స్పిన్ ను భారత క్రికెట్ అభిమానులు చాలా మిస్ అవుతారు. అతడు లేడన్న ధీమా ప్రత్యర్థి జట్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మరి అంతటి ప్లేయర్ స్థానాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.