తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Eng Vs Wi: ఒకే ఓవ‌ర్‌లో మూడు సిక్సులు, మూడు ఫోర్లు - ఫిలిప్ సాల్ట్ విధ్వంసం - వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన‌ ఇంగ్లండ్‌

ENG vs WI: ఒకే ఓవ‌ర్‌లో మూడు సిక్సులు, మూడు ఫోర్లు - ఫిలిప్ సాల్ట్ విధ్వంసం - వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన‌ ఇంగ్లండ్‌

20 June 2024, 12:36 IST

google News
  • ENG vs WI: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వెస్టిండీస్‌కు తొలి ఓట‌మి ఎదురైంది. సూప‌ర్ 8 ఆరంభ పోరులో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్‌లో 87 ర‌న్స్ చేసి ఇంగ్లండ్‌కు విజ‌యాన్ని అందించాడు.

ఫిలిప్ సాల్ట్
ఫిలిప్ సాల్ట్

ఫిలిప్ సాల్ట్

ENG vs WI: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వెస్టిండీస్ జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. లీగ్ ద‌శ‌లో ఓట‌మే లేకుండా సూప‌ర్ 8లోకి దూసుకొచ్చిన వెస్టిండీస్‌కు ఇంగ్లండ్ తొలిసారి పొట్టి ప్రపంచ కప్ లో ఓట‌మి రుచి చూపించింది. సూప‌ర్ 8లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 180 ప‌రుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ మ‌రో ప‌దిహేను బాల్స్ ఉండ‌గానే కేవ‌లం 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది.

ఆకాశ‌మే హ‌ద్దుగా...

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ఫిలిప్ సాల్ట్ 47 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, ఏడు ఫోర్ల‌తో 87 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

వెస్టిండీస్ బౌల‌ర్ రోమారియో షెఫ‌ర్డ్ వేసిన ప‌ద‌హారో ఓవ‌ర్‌లో ఫిలిప్ సాల్ట్ మూడు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో ఏకంగా 30 ప‌రుగులు రాబ‌ట్టాడు. చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ విజ‌యానికి న‌ల‌భై ప‌రుగులు అవ‌స‌రం కావ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారేలా క‌నిపించింది.

ఒకే ఓవ‌ర్‌లో...

సాల్ట్ విధ్వంసంతో ఒకే ఓవ‌ర్‌లో వెస్టిండీస్ ఓట‌మి ఖాయ‌మైంది. సాల్ట్‌తో పాజు జానీ బెయిర్ స్టో కూడా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఇర‌వై ఆరు బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 48 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ 25, మెయిన్ అలీ 13 ప‌రుగులు చేశారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ ఛేజ్‌, ఆంద్రీ ర‌సెల్ త‌లో ఓ వికెట్ తీసుకున్నారు.

ఐదు సిక్స‌ర్లు...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 180 ప‌రుగులు చేసింది. జాన్స‌న్ ఛార్లెస్ 38 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ 32 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 36 ర‌న్స్ చేయ‌గా...రోమ‌న్ పావెల్ ప‌దిహేడు బాల్స్‌లో ఐదు సిక్స‌ర్ల‌తో 36 ర‌న్స్‌తో దంచికొట్టాడు.

చివ‌ర‌లో రూథ‌ర్‌ఫోర్డ్ 15 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో 28 ర‌న్స్ చేయ‌డంతో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. వెస్టిండీస్ జోరు చూస్తే ఈజీగా రెండు వందల పరుగుల దాటేలా కనిపించింది. కానీ చివరలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 180 పరుగులకే కట్టడి చేశారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్‌, మెయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌తో పాటు జోఫ్రా ఆర్చ‌ర్ త‌లో ఓ వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్ పై గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్ 2లో టాపర్ గా నిలిచింది.

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం