India vs England Live Score: జడేజాకు నాలుగు వికెట్లు.. ఇంగ్లండ్ ఆలౌట్..
India vs England Live Score: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీమ్ 353 పరుగులకు ఆలౌటైంది. రూట్ సెంచరీ, రాబిన్సన్ హాఫ్ సెంచరీ చేయగా.. జడేజా నాలుగు వికెట్లతో రాణించాడు.
India vs England Live Score: రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు సాధించింది. ఒక దశలో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. చివరికి రూట్ సెంచరీ, టెయిలెండర్ ఓలీ రాబిన్సన్ హాఫ్ సెంచరీతో 353 పరుగులు చేసింది. రెండో రోజు ఉదయం మరో 51 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయింది. జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు.
కొంప ముంచిన ఆ ముగ్గురూ..
ఇంగ్లండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగుల స్కోరు సాధించిందంటే ముగ్గురు బ్యాటర్లే కారణం. బజ్‌బాల్ పక్కన పెట్టి బ్యాటింగ్ భారాన్ని మోస్తూ ఓపిగ్గా ఆడిన జో రూట్ సెంచరీతోపాటు టెయిలెండర్ ఓలీ రాబిన్సన్, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తమ టీమ్ కు మంచి స్కోరు అందించారు. తొలి రోజు ఫోక్స్ తో కలిసి ఆరో వికెట్ కు 113 పరుగుల జోడించిన రూట్.. ఎనిమిదో వికెట్ కు రాబిన్సన్ తో కలిసి 102 రన్స్ జోడించాడు.
చివరికి రూట్ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాబిన్సన్ 58, బెన్ ఫోక్స్ 47, ఓపెనర్ జాక్ క్రాలీ 42 రన్స్ చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు పడిన మూడు వికెట్లూ అతని ఖాతాలోకే వెళ్లాయి. సెంచరీ భాగస్వామ్యంతో ఇండియాను విసిగిస్తున్న రూట్, రాబిన్సన్ జోడీని అతడే విడగొట్టాడు.
మొదట తొలి బంతికే రాబిన్సన్ ను ఔట్ చేసిన అతడు.. నాలుగో బంతికి షోయబ్ బషీర్ (0)ను పెవిలియన్ కు పంపించాడు. రూట్, రాబిన్సన్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసి ఇంగ్లండ్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఇక మిగతా బౌలర్ల విషయానికి వస్తే తొలి రోజే ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు.
జో రూట్ రికార్డు
ఇండియాతో టెస్టు సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమయ్యాడు జో రూట్. తనకు అలవాటు లేని బజ్ బాల్ తో చెత్త షాట్లకు వికెట్లు పారేసుకున్నాడు. కానీ రాంచీ టెస్టులో మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ చేశాడు. ఇండియాపై టెస్టుల్లో అతనికిది 10వ సెంచరీ. ఇప్పటి వరకూ ఏ ఇతర బ్యాటర్ టెస్టుల్లో ఇండియాపై ఇన్ని సెంచరీలు చేయలేదు. ఇప్పటి వరకూ 9 సెంచరీలతో స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.
ఓవరాల్ గా రూట్ టెస్టుల్లో 31 సెంచరీలు చేయగా.. అందులో పది ఇండియాపైనే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రెండు కీలకమైన భాగస్వామ్యాలతో ఇంగ్లండ్ స్కోరును 350 దాటించాడు. చివరికి 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. రూట్ ఇన్నింగ్స్ లో కేవలం 10 ఫోర్లు మాత్రమే ఉండగా.. 274 బంతులు ఎదుర్కొన్నాడు. 112 పరుగులకే 5 కీలకమైన వికెట్లు పడిపోవడంతో ఇంగ్లండ్ టీమ్ తమ బజ్‌బాల్ పక్కన పెట్టి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది.