India vs England Live: బజ్‌బాల్ పక్కన పెట్టిన ఇంగ్లండ్.. రూట్ సెంచరీ.. తొలి రోజు టీమిండియాతో సమం-india vs england live no bazball this time root hundred takes england past 300 on day 1 of 4th test cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Live: బజ్‌బాల్ పక్కన పెట్టిన ఇంగ్లండ్.. రూట్ సెంచరీ.. తొలి రోజు టీమిండియాతో సమం

India vs England Live: బజ్‌బాల్ పక్కన పెట్టిన ఇంగ్లండ్.. రూట్ సెంచరీ.. తొలి రోజు టీమిండియాతో సమం

Hari Prasad S HT Telugu
Feb 23, 2024 04:44 PM IST

India vs England Live: నాలుగో టెస్టు తొలి రోజు తొలి సెషన్ లోనే 5 వికెట్లు పడటంతో ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ పక్కన పెట్టేసింది. జో రూట్ సెంచరీ చేయడంతో ఆ టీమ్ తొలి రోజు టీమిండియాతో సమంగా నిలిచింది.

బజ్‌బాల్ ను పక్కన పెట్టి సెంచరీతో ఇంగ్లండ్ ను ఆదుకున్న జో రూట్
బజ్‌బాల్ ను పక్కన పెట్టి సెంచరీతో ఇంగ్లండ్ ను ఆదుకున్న జో రూట్ (AP)

India vs England Live: బజ్‌బాల్ గత రెండు టెస్టుల్లో తమ కొంప ముంచడంతో ఇంగ్లండ్ వెనక్కి తగ్గింది. ఈ సిరీస్ లో పరుగులు చేయడానికి తంటాలు పడుతున్న సీనియర్ బ్యాటర్ జో రూట్.. ఆ బజ్‌బాల్ ను వదిలించుకొని మరోసారి తనదైన స్టైల్లో ఆడుతూ సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 302 రన్స్ చేసింది. రూట్ 106, ఓలీ రాబిన్సన్ 31 రన్స్ చేసి క్రీజులో ఉన్నారు.

తొలి సెషన్ లోనే సగం వికెట్లు పడినా..

రెండు, మూడు టెస్టుల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలోనాలుగో టెస్టు బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు తొలి సెషన్ లోనే గట్టి షాక్ తగిలింది. టాస్ గెలిచిన ఆనందం ఆవిరైపోయింది. టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ వెంటవెంటనే మూడు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. జడేజా, అశ్విన్ కూడా చెరో వికెట్ తీయడంతో ఇంగ్లండ్ లంచ్ సమయానికి 5 వికెట్లకు 112 రన్స్ చేసింది.

లంచ్ తర్వాత ఇక ఎంతోసేపు నిలవదు అనుకున్న సమయంలో ఈ సిరీస్ లో ఫామ్ లో లేని జో రూట్ నెమ్మదిగా క్రీజులో కుదురుకున్నాడు. బజ్‌బాల్ అంటూ పిచ్చి పిచ్చి షాట్లకు వికెట్లు పారేసుకున్న అతడు.. ఈ మ్యాచ్ లో మాత్రం తనదైన స్టైల్లో నింపాదిగా ఆడాడు. అతనికి బెన్ ఫోక్స్ (47) మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 113 రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ కోలుకుంది.

రూట్ సెంచరీ

ఈ సిరీస్ లో దారుణంగా విఫలమైన రూట్.. ఈ మ్యాచ్ లో ఏకంగా సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది 31వ సెంచరీ కావడం విశేషం. ఫోక్స్ ఔటైన తర్వాత కాసేపటికే టామ్ హార్ట్‌లీ (13) కూడా పెవిలియన్ చేరాడు. అయితే ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రాబిన్సన్ (31 నాటౌట్) రూట్ కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు అజేయంగా 57 పరుగులు జోడించారు.

రూట్ 226 బంతుల్లో 106 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్ లో కేవలం 9 ఫోర్లే ఉన్నాయి. టెస్టుల్లోనూ 4, 5 ఎకానమీతో పరుగులు చేసిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ తొలి రోజు మాత్రం కేవలం 3.35 ఎకానమీతో మాత్రమే రన్స్ చేయగలిగింది. తొలి సెషన్ లోనే సగం టీమ్ ఔటవడంతో బ్యాటింగ్ భారం మొత్తాన్ని రూట్ మోశాడు. ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.

టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్, జడేజా చెరొక వికెట్ తీసుకున్నారు. తొలి సెషన్ లో పట్టు బిగించిన టీమిండియా బౌలర్లు.. తర్వాత వదిలేయడంతో ఇంగ్లండ్ కోలుకుంది. నిజానికి అస్థిరమైన బౌన్స్ తో మొదట్లోనే బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన పిచ్ పై తొలి రోజే ఇంగ్లండ్ మంచి స్కోరే చేసిందని చెప్పాలి.

Whats_app_banner