తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhoni Craze: ధోనీయా మజాకా.. క్రీజులోకి వస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయ్.. స్టార్ స్పోర్ట్స్ డేటా చూశారా?

Dhoni Craze: ధోనీయా మజాకా.. క్రీజులోకి వస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయ్.. స్టార్ స్పోర్ట్స్ డేటా చూశారా?

Hari Prasad S HT Telugu

12 April 2024, 20:25 IST

google News
    • Dhoni Craze: ఐపీఎల్లో ధోనీకి ఉన్న క్రేజ్ మరే ఇతర ప్లేయర్ కు లేదని మరోసారి స్పష్టమైంది. తాజాగా బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రివీల్ చేసిన డేటా చూస్తే మతి పోవాల్సిందే.
ధోనీయా మజాకా.. క్రీజులోకి వస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయ్
ధోనీయా మజాకా.. క్రీజులోకి వస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయ్ (CSK-X)

ధోనీయా మజాకా.. క్రీజులోకి వస్తుంటే చెవులు చిల్లులు పడుతున్నాయ్

Dhoni Craze: ధోనీయా మజాకా? ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా ఈ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదని తాజాగా బయటకు వచ్చిన ఓ ప్రత్యేకమైన డేటా స్పష్టం చేస్తోంది. ఐపీఎల్ 2024లోని వేదికల్లో అత్యధిక డెసిబుల్స్ సౌండ్ నమోదైన వాటి వివరాలను స్టార్ స్పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. అందులో ఎలాంటి సందేహం లేకుండా ధోనీ ఆడుతున్న వేదికలే టాప్ లో ఉన్నాయి.

ధోనీ వస్తుంటే చెవులకు చిల్లు

ఐపీఎల్ 2024లో ధోనీ బ్యాటింగ్ చేసిన సందర్భాలు తక్కువే. కానీ వాటి కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చెన్నైలోనే కాదు దేశంలో అతడు ఎక్కడికి వెళ్లి ఆడినా.. అది చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలాగే అనిపిస్తోంది. అలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ధోనీ బ్యాటింగ్ కు దిగుతుంటే స్టేడియం అంతా మార్మోగిపోతోంది.

ఓ రేంజ్ లో సౌండ్ పొల్యూషన్ నమోదవుతోంది. ఐపీఎల్ వేదికల్లో నమోదవుతున్న అత్యధిక డెసిబుల్స్ పై స్టార్ స్పోర్ట్స్ ఓ రిపోర్ట్ రివీల్ చేసింది. అందులో రెండు ధోనీ బ్యాటింగ్ కు దిగుతున్న సందర్భంలోనివే కావడం గమనార్హం. అత్యధికంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నమోదైంది. ధోనీ టాస్ కు ముందు గ్రౌండ్లోకి అడుగు పెడుతుంటే.. స్టేడియంలోని ఫ్యాన్స్ చేసిన సౌండ్ ఏకంగా 130 డెసిబుల్స్ గా నమోదు కావడం విశేషం.

తొలి మ్యాచ్‌లోనే సౌండ్ పొల్యూషన్

ఐపీఎల్ 2024లో జరిగిన తొలి మ్యాచ్ అది. అంతకు ఒక రోజు ముందే సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నట్లు ఆ ఫ్రాంఛైజీ అనౌన్స్ చేసింది. ఇక లిస్టులో రెండో స్థానంలో ఉన్నది కూడా ధోనీ ఉన్న మ్యాచ్ లోనిదే. ఈ మ్యాచ్ వైజాగ్ లో జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు ఏకంగా 128 డెసిబుల్స్ సౌండ్ చేశారు అభిమానులు.

ఆ మ్యాచ్ లో ధోనీ తన విశ్వరూపం చూపించాడు. కేవలం 16 బంతుల్లో 37 రన్స్ చేశాడు. అయినా సీఎస్కే మాత్రం 20 పరుగులతో ఓడిపోయింది. కానీ అభిమానులు ధోనీ మెరుపులు చూశామన్న ఆనందంతో పొంగిపోయారు. ఆ ఇన్నింగ్స్ లో ధోనీ 4 ఫోర్లు, 3 సిక్స్ లు కొట్టాడు. గతేడాది ఫైనల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ తర్వాత ధోనీ బ్యాటింగ్ చేసిన తొలి సందర్భం ఇదే.

ఈ లిస్టులో మూడో స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు. ఆర్సీబీ బ్యాటర్ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోఅర్ష్‌దీప్ బౌలింగ్ లో ఆడిన స్కూప్ షాట్ కు స్టేడియంలో ప్రేక్షకులు ఓ రేంజ్ లో కేరింతలు కొట్టారు. ఆ షాట్ చూసి డగౌట్ లో ఉన్న కోహ్లి కూడా షాక్ తిన్నాడు. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. రెండు బౌండరీలతో కార్తీక్ మ్యాచ్ ముగించాడు. ఆర్సీబీ ఈ సీజన్లో గెలిచిన ఏకైక మ్యాచ్ అదే.

తదుపరి వ్యాసం