LSG vs CSK: 9 కోట్లకు న్యాయం చేసిన స్టోయినస్ - రుతురాజ్ మెరుపు సెంచరీ వృథా - చెన్నైని ఓడించిన లక్నో
24 April 2024, 5:53 IST
LSG vs CSK: స్టోయినస్ మెరుపు సెంచరీతో చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సాధించింది. 63 బాల్స్‌లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 124 పరుగులతో చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు స్టోయినస్.
మార్కస్ స్టోయినస్
LSG vs CSK: రుతురాజ్ సెంచరీ చేసిన చెన్నైకి ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండర్ స్టోయినస్ మెరుపు శతకంతో చెన్నైని దెబ్బకొట్టి లక్నోకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. 63 బాల్స్‌లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 124 పరుగులు చేసిన స్టోయినస్ చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెన్నై విధించిన 211 పరుగుల టార్గెట్‌ను మరో మూడు బాల్స్ మిగిలుండగానే లక్నో సూపర్ జెయింట్స్ చేధించింది. 19. 3 ఓవర్లలో 213 రన్స్ చేసింది.
స్టోయినస్ ఒంటరిపోరాటం...
211 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ జతగా చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు స్టోయినస్. కెప్టెన్ కేఎల్ రాహుల్ (16 పరుగులు), దేవ్‌దత్ పడిక్కల్ (13 రన్స్) తక్కువ స్కోర్లకే ఔట్ అయినా స్టోయినస్ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు.
దంచికొట్టిన పూరన్...
నికోలస్ పూరన్ అండతో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు స్టోయినస్. లక్నోను విజయం దిశగా నడిపించారు. నాలుగో వికెట్‌కు 5.3 ఓవర్లలోనే వీరిద్దరు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే స్టోయినస్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. నికోలస్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో లక్నో గెలుపుకు చేరువైంది.
15 బాల్స్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 34 పరుగులు చేసిన నికోలస్ పూరన్ ఔటయ్యాడు. దీపక్ హుడా తో కలిసి మరో మూడు బాల్స్ మిగిలుండగానే లక్నోకు అదిరిపోయే విక్టరీని అందించాడు స్టోయినస్. ఎట్టకేలకు తొమ్మిది కోట్ల ధరకు అతడు అన్యాయం చేశాడు.
గత ఏడు మ్యాచుల్లో కలిపి కేవలం 130 రన్స్ మాత్రమే చేసిన స్టోయినస్ మెరుపు సెంచరీతో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాడు. చెన్నై బౌలర్లలో పతిరన రెండు వికెట్లు, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రహమాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
రుతురాజ్ సెంచరీ...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ 108 పరుగులు, శివమ్ దూబె 66 రన్స్ తో ఆకట్టుకున్నారు.రహానే, మిచెల్, జడేజా విఫలమైనా దూబేతో కలిసి చెన్నైకి రుతురాజ్ భారీ స్కోరు అందించాడు.
దూబే ధనాధన్ ఇన్నింగ్స్…
రుతురాజ్ గైక్వాడ్ 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్ లతో సెంచరీ పూర్తిచేయగా.... దూబే కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పోటీపడి వీరిద్దరు పరుగుల వరద పారించారు. శివమ్ దూబే 27 బంతుల్లోనే 7 సిక్స్ లు, 3 ఫోర్లతో 66 రన్స్ చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. చివరి బంతి వరకు క్రీజులో ఉన్న రుతురాజ్ 60 బాల్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్స్ లతో 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్టోయినస్ దెబ్బతో రుతురాజ్, దూబే పోరాటం వృథాగా మారింది.