Mayank Yadav: టీ20 ప్రపంచకప్‍లో మయాంక్ యాదవ్‍కు చోటు దక్కుతుందా?
03 April 2024, 16:54 IST
- Mayank Yadav: యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఐపీఎల్‍లో రెండు మ్యాచ్‍ల్లో అత్యంత వేగంతో అద్భుతంగా అతడు బౌలింగ్ చేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో అతడిని తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mayank Yadav: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాలో మయాంక్ యాదవ్‍కు చోటు దక్కుతుందా?
Mayank Yadav: ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న పేసర్ మయాంక్ యాదవ్ ప్రపంచ క్రికెట్‍లో అలజడి సృష్టించాడు. ప్రస్తుతం అందరి దృష్టి అతడివైపే ఉంది. ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ఆడింది రెండు మ్యాచ్‍లే అయిన ఈ 21 ఏళ్ల యువ పేసర్ చేసిన ఫాస్ట్ బౌలింగ్ అలాంది. గంటకు 150 కిలోమీటర్ల వేగానికి పైగా వేగంగా బంతులను అలవోకగా సంధించాడు మయాంక్ యాదవ్. వేగంతో పాటు లైన్, లెన్త్ కూడా సరిగ్గా మెయింటెన్ చేశాడు. కళ్లు చెదిరే బంతులు వేశాడు. ఐపీఎల్‍లో తాను ఆడిన తొలి రెండు మ్యాచ్‍ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‍గా మారాడు.
ప్రస్తుత ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో మార్చి 30న జరిగిన మ్యాచ్‍లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్ మూడు వికెట్లు (3/27) పడగొట్టాడు. అత్యంత వేగంతో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ ఇండియన్ అన్‍క్యాప్డ్ బౌలర్ 150 కిలోమీటర్లపైగా వేగంగా బంతులు వేయడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‍లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఏప్రిల్ 1న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‍లోనూ 4 ఓవర్లో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు మయాంక్ యాదవ్. ఇంటర్నేషనల్ స్టార్స్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‍ను ఔట్ చేశాడు. వేగంతో పాటు.. అద్భుతమైన నియంత్రణతో మయాంక్ మెప్పించాడు. ఓ బంతిని 156.7 కిలోమీటర్ల వేగంతో వేసి.. ఈ సీజన్‍లో ఫాస్టెస్ట్ బాల్ రికార్డు సాధించాడు.
టీ20 ప్రపంచకప్‍లో చోటు!
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ఆడింది రెండు మ్యాచ్‍లే అయినా.. మయాంక్ యాదవ్‍ను ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది.పేస్‍కు అనుకూలించే విండీస్ పిచ్‍లపై మయాంక్ యాదవ్ మరింత భీకరంగా ఉండే అవకాశం ఉంది. జస్‍ప్రీత్ బుమ్రాకు మయాంక్ జతకలిస్తే భారత బౌలింగ్ మరింత భీకరంగా ఉండే అవకాశం ఉంది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍కు భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ టోర్నీ ఆడలేడని తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో మయాంక్ యాదవ్‍ను సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. వేగంతో పాటు మంచి నియంత్రణ ఉండటం అతడికి పెద్ద ప్లస్‍గా మారింది. అంత వేగంగా బౌలింగ్ చేస్తున్నా.. రెండు మ్యాచ్‍ల్లో తక్కువ పరుగులే ఇచ్చాడు.
అయితే, ఈ ఏడాది ఐపీఎల్‍లో రానున్న మ్యాచ్‍ల్లో మయాంక్ యాదవ్ ప్రదర్శనను టీమిండియా సెలెక్టర్లు గమనించనున్నారు. ఒకవేళ అతడు ఇదే విధంగా రాణిస్తే తప్పనిసరిగా టీ20 ప్రపంచకప్ కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటారు. క్రమంగా 145 కిలోమీటర్లకుపైగా వేగంతో బంతులు వేసే పేసర్లు ఇండియాలో తక్కువే. అందుకే మంచి వేగం ఉన్న మయాంక్‍కు టీమిండియాలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ జట్టు చర్చల్లో మయాంక్ యాదవ్ పేరు తప్పకుండా ఉంటుందని ఆస్ట్రేలియా మాజీ స్టార్ టామ్ మూడీ కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు మాజీలు కూడా అలాంటి కామెంట్లే చేశారు.
రాజధాని ఎక్స్‌ప్రెస్
మయాంక్ యాదవ్ సొంత రాష్ట్రం ఢిల్లీ. గత రెండు సీజన్లుగా అతడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఉన్నాడు. అయితే, గాయం కారణంగా గతేడాది ఆడలేకపోయాడు. ఈ ఏడాది పంజాబ్‍తో మ్యాచ్‍లో ఐపీఎల్‍లో అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్‍ల్లోనే ఆరు వికెట్లు తీయడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచున్నాడు. ఇప్పటికే ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’ అంటూ అతడిని పిలుస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు స్టార్ పేసర్‌గా ఎదుగుతాడని అంచనాలు వేస్తున్నారు. మయాంక్ యాదవ్ ఇదే విధంగా అద్భుత ప్రదర్శన కొనసాగించాలని భారత క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
టాపిక్