KKR vs SRH IPL 2024 Final: సన్‍రైజర్స్, నైట్‍రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ ఫైట్ నేడే.. టైటిల్ పట్టేదెవరో?
26 May 2024, 5:00 IST
- KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్‍కు వేళయింది. టైటిల్ కోసం సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ నేడు (మే 26) తలపడనున్నాయి. ఛాంపియన్‍గా నిలిచేందుకు తుదిపోరులో సర్వశక్తులు ఒడ్డనున్నాయి.
KKR vs SRH IPL 2024 Final: నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ ఐపీఎల్ ఫైనల్ ఫైట్ నేడే.. టైటిల్ పట్టేదెవరో?
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: రెండు నెలలకుపైగా సాగుతున్న క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ముగింపునకు వచ్చేసింది. సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) జట్లు నేడు (మే 26) టైటిల్ కోసం ఫైనల్ యుద్ధంలో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. అగ్రెసివ్ బ్రాండ్ ఆటతో 8 జట్లను ఇంటికి పంపించేసిన ఈ రెండు టీమ్స్ ఈ ఐపీఎల్ 17వ సీజన్ ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నేడు (మే 26) హైదరాబాద్, కోల్‍కతా మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ జరగనుంది. ఈ తుదిపోరు వివరాలు ఇవే.
పదేళ్ల తర్వాత కేకేఆర్ పట్టేస్తుందా?
ఈ ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ దూకుడైన ఆటతో భేష్ అనిపించుకుంది. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా రావడం.. గతేడాది దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‍కు తిరిగి వచ్చేయటంతో దుమ్మురేపింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలువడమే కాకుండా.. క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍ను ఓడించి ఫైనల్‍లో అడుగుపెట్టింది. కోల్‍కతా నైట్‍రైడర్స్ టీమ్‍కు ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. 2012, 2014, 2021 తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ టీమ్ ఈ 2024 ఫైనల్‍కు చేరింది. 2012, 2014ల్లో కేకేఆర్ టైటిళ్లు పట్టింది. నేడు సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో జరిగే ఫైనల్‍లో సత్తాచాటి పదేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్‍గా నిలువాలనే కసితో ఉంది.
అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్‍లో సునీల్ నరైన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్‍లో విజృంభిస్తుండం బాగా కలిసి వస్తోంది. వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసెల్ సహా మిగిలిన బ్యాటర్లు కూడా అవసరమైన సమయాల్లో రాణించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొడుతుండడం, ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్‌గా ఉన్న మిచెల్ స్టార్క్.. క్వాలిఫయర్-1తో ఫామ్‍లోకి రావడం కేకేఆర్‌కు సానుకూల అంశాలుగా ఉన్నాయి.
రెండో టైటిల్ కోసం రైజర్స్
సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అయితే, గత మూడు సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. గతేడాది 2023లో పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచి నిరాశపరిచింది. అయితే, ఈ 2024 సీజన్‍కు ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను తీసుకొని కెప్టెన్ చేయడం ఎస్ఆర్‌హెచ్‍కు కలిసి వచ్చింది. జట్టులో దూకుడును అతడు బాగా నూరిపోశాడు. ట్రావిస్ హెడ్ రావడం, అభిషేక్ శర్మ అదిరిపోయే ఫామ్‍లో ఉండడం, హెన్రిచ్ క్లాసెన్ దుమ్మురేపుతుండడం, కీలక సమయాల్లో నితీశ్ శర్మ రాణిస్తుండడం ఇలా ఈ సీజన్ అంతా హైదరాబాద్‍కు కలిసి వచ్చింది. ప్రత్యర్థి జట్లు గడగడలాడేలా రైజర్స్ బ్యాటింగ్ సాగింది. ఏకంగా ఐపీఎల్‍లో అత్యధిక స్కోరును ఇదే సీజన్‍లో రెండుసార్లు సాధించి దూకుడు కేరాఫ్‍గా నిలిచింది ఎస్ఆర్‌హెచ్. బౌలింగ్‍లో నటరాజన్, భువనేశ్వర్, ఉనాద్కత్, కెప్టెన్ కమిన్స్ కూడా రాణిస్తున్నారు. చెపాక్‍లో జరిగిన క్వాలిఫయర్-2లో అభిషేక్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‍లో అదరగొట్టడం ఫైనల్‍కు మరింత ప్లస్‌గా ఉంది.
క్వాలిఫయర్-1లో ఓడించిన కోల్‍కతాపై తుదిపోరులో సత్తాచాటాలని హైదరాబాద్ పట్టుదలతో బరిలోకి దిగనుంది. దూకుడైన ఆటనే కొనసాగించే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఎనిమిదేళ్ల తర్వాత టైటిల్ ముద్దాడాలనే లక్ష్యంతో ఫైనల్‍లో అడుగుపెట్టనుంది సన్‍రైజర్స్.
తుది జట్లు అంచనా
ఫుల్ జోష్‍లో ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ ఐపీఎల్ 2024 ఫైనల్ కోసం తుదిజట్లలో మార్పులు చేసే అవకాశాలు లేవు.
హైదరాబాద్ తుదిజట్టు (అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్) , నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమాద్, షెహబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనాద్కత్, భువనేశ్వర్ కుమార్
నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాద్ ముందుగా బౌలింగ్ చేస్తే నటరాజన్ తుదిజట్టులో ఉండి.. బ్యాటింగ్ చేసేటప్పుడు హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కోల్‍కతా నైట్‍రైడర్స్ తుదిజట్టు (అంచనా): సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, రింకూ సింగ్, రమణ్‍దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ముందు బ్యాటింగ్ లేకపోతే బౌలింగ్ చేసే దాన్ని బట్టి నితీశ్ రాణా, వైభవ్ అరోరా ఇంపాక్ట్ ప్లేయర్లుగా మార్పిడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హెడ్ టూ హెడ్
ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్ పరస్పరం 27 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. ఇందులో కోల్‍కతా 18సార్లు గెలిస్తే.. హైదరాబాద్ 9సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో పరస్పరం నాలుగుసార్లు తలపడితే.. చెరో రెండుసార్లు విజయం సాధించాయి.
కోల్‍కతా, హైదరాబాద్ మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్ నేటి (మే 26) రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలుకానుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లు, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.