IND vs AUS 3rd Test: భారత స్టార్ క్రికెటర్‌కి గాయం.. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముంగిట టీమిండియాలో కొత్త టెన్షన్
12 December 2024, 14:39 IST
Jasprit Bumrah Injury: జస్‌ప్రీత్ బుమ్రా తొడ కండరాలకి గాయమైంది. దాంతో గత ఆదివారం నుంచి నెట్స్‌లో బౌలింగ్‌కి దూరంగా ఉన్న బుమ్రా.. మూడో టెస్టులో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అయితే..?
జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముంగిట భారత్ జట్టులో కొత్త టెన్షన్ మొదలైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు జరగగా.. ఇందులో ఫస్ట్ టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించాయి. దాంతో ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది.
గాయం నుంచి కోలుకోని బుమ్రా
భారత్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే ఈ సిరీస్‌లో తప్పక గెలవాల్సి ఉండగా.. కీలకమైన మూడో టెస్టులో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడటంపై సందిగ్ధత నెలకొంది.
గత ఆదివారం ముగిసిన అడిలైడ్ టెస్టులో బౌలింగ్ చేస్తుండగా.. బుమ్రా తొడ కండరాలకి గాయమైంది. అయితే.. ఈ పేసర్ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. మూడో టెస్టులో ఆడటం సందేహమేనని వార్తలు వస్తున్నాయి. అయితే.. నెట్స్‌లో మాత్రం బుమ్రా సౌకర్యంగానే బౌలింగ్ చేస్తున్నట్లు టీమిండియా మేనేజ్‌మెంట్ చెప్పుకొస్తోంది. అయితే.. నెట్స్‌లో బుమ్రా స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండటంతో.. అతను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని స్పష్టమైంది.
12 వికెట్లతో టాప్‌లో బుమ్రా
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకి రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించడమే కాదు గెలిపించాడు కూడా. ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే.. ఈ రెండు టెస్టుల్లోనూ 12 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
మూడో టెస్టు జరిగే బ్రిస్బేన్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలిస్తుంది. మరీ ముఖ్యంగా.. జస్‌ప్రీత్ బుమ్రా వేగం, బౌన్స్ రాబట్టే తీరుకి ఈ పిచ్ బాగా నప్పుతుంది. దాంతో ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడటం భారత్ జట్టుకి చాలా కీలకం.
గాయంతో ప్రయోగం చేస్తారా?
కానీ.. బుమ్రా గాయంతో ప్రయోగాలు చేస్తే.. భవిష్యత్తులో అది తీవ్రతరం అయ్యి ఇబ్బందులు ఎదురువుతాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో.. బుమ్రాని ఆడించడం మినహా భారత్ జట్టు ముందు మరో ప్రత్యామ్నాయ మార్గం లేకపోయింది.
ఇద్దరు ఆప్షన్స్.. కానీ?
భారత్ జట్టు రిజర్వ్ బెంచ్‌లో ఆకాశ్ దీప్, ప్రసీద్ కృష్ణ ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని బుమ్రా ప్లేస్‌లో ఆడించినా.. అనుభవం లేకపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఓ ఆట ఆడేసుకుంటారు. బుమ్రా లేకపోతే.. భారత్ బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం ఆస్ట్రేలియా చాలా సులువు అయిపోతుంది. దాంతో బుమ్రాపై పనిభారం తగ్గించేందుకు అతనితో తక్కువ ఓవర్లు వేయించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.