తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ishan Kishan: ఇషాన్ కిషన్ ఎందుకిలా చేస్తున్నాడు? ద్రవిడ్ చెప్పినా వినని యువ వికెట్ కీపర్

Ishan Kishan: ఇషాన్ కిషన్ ఎందుకిలా చేస్తున్నాడు? ద్రవిడ్ చెప్పినా వినని యువ వికెట్ కీపర్

Hari Prasad S HT Telugu

08 February 2024, 9:19 IST

google News
    • Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా వినడం లేదు. రంజీ ట్రోఫీ ఆడకుండా ప్రస్తుతం పాండ్యా బ్రదర్స్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తుండటం గమనార్హం.
ద్రవిడ్ చెప్పినా రంజీ ట్రోఫీ ఆడని ఇషాన్ కిషన్
ద్రవిడ్ చెప్పినా రంజీ ట్రోఫీ ఆడని ఇషాన్ కిషన్ (PTI)

ద్రవిడ్ చెప్పినా రంజీ ట్రోఫీ ఆడని ఇషాన్ కిషన్

Ishan Kishan: ఇషాన్ కిషన్ కు ఏమైంది? గతేడాది నవంబర్ లో చివరిసారి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన తర్వాత తనకు మెంటల్ బ్రేక్ కావాలంటూ సౌతాఫ్రికా టూర్ నుంచి మధ్యలోనే వచ్చేశాడు.

ఆ తర్వాత దుబాయ్ లో పార్టీ చేసుకుంటూ కనిపించాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అతన్ని రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా చెప్పినా వినకుండా హార్దిక్, కృనాల్ పాండ్యాలతో కలిసి బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఇషాన్ కిషన్ మళ్లీ టీమ్‌లోకి వస్తాడా?

ఇషాన్ కిషన్ టీమిండియాలో నిలదొక్కుకుంటున్నాడు అనుకున్న సమయంలో చేజేతులా అవకాశాలను దూరం చేసుకుంటున్నాడా? బ్రేక్ కావాలంటూ అర్ధంతరంగా

సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చేసిన అతడు.. తర్వాత కనీసం డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడటం లేదు. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలంటే ఏదో ఒక క్రికెట్ ఆడాల్సిందే అని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా పట్టించుకోవడం లేదు.

ఓవైపు రంజీ ట్రోఫీ జరుగుతోంది. జార్ఖండ్ టీమ్ అతనికి అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉంది. కానీ అతడు మాత్రం బరోడా వెళ్లి అక్కడ పాండ్యా బ్రదర్స్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చి నేషనల్ టీమ్ తలుపు తట్టడానికి ఏ క్రికెటర్ కు అయినా రంజీ ట్రోఫీలాంటి డొమెస్టిక్ టోర్నీలు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇషాన్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు.

నేను అలా అనలేదు: ద్రవిడ్

ఇక ఇంగ్లండ్ తో రెండో టెస్టు ముగిసిన తర్వాత ఇషాన్ విషయంలో ద్రవిడ్ కూడా మాట మార్చినట్లు కనిపిస్తోంది. "అతడు సిద్ధంగా ఉన్నప్పుడు తీసుకుంటామని చెప్పాను. డొమెస్టిక్ క్రికెట్ ఆడమని చెప్పలేదు. అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో అప్పుడు అని అన్నాను. ఎంతో కొంత క్రికెట్ ఆడి తిరిగి జట్టులోకి రావాలి. ఆ ఛాయిస్ అతనిదే. అతనిపై ఏదో చేయాలిన ఒత్తిడి చేయడం లేదు. మేము అతనితో మాట్లాడుతూనే ఉన్నాం" అని ద్రవిడ్ అన్నాడు.

ఏదో ఒక క్రికెట్ అని ద్రవిడ్ అంటున్నాడు. రంజీ ట్రోఫీని మించినది ఇషాన్ కిషన్ కు ఇంకేముంటుంది? కానీ అతడు మాత్రం ప్రస్తుతం బరోడాలో ఉన్నట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది. కొన్ని వారాలుగా బరోడాలోనే ఉంటున్న ఇషాన్.. అక్కడి రిలయెన్స్ స్టేడియంలో వసతులను ఉపయోగించుకుంటున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు సరే.. కానీ కాంపిటీటివ్ క్రికెట్ లోకి ఎప్పుడొస్తాడన్నది అసలు ప్రశ్న.

తిరిగి జట్టులోకి రావాలంటే ఏదో ఒక క్రికెట్ ఆడాల్సిందే అని ద్రవిడ్ చెప్పిన నేపథ్యంలో ఇషాన్ ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. అతడు ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం తిరిగి నేషనల్ టీమ్ లోకి ఇప్పట్లో వచ్చే పరిస్థితి ఉండదన్నది మాత్రం స్పష్టమవుతూనే ఉంది.

ఇషాన్ కాంట్రాక్ట్ ఉంటుందా?

ఇషాన్ కిషన్ ఇప్పటికైనా రంజీ ట్రోఫీ ఆడితే బెటర్. నిజానికి శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి హర్యానాతో జార్ఖండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ కు కూడా ఇషాన్ దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని బీసీసీఐ కాంట్రాక్టు ఉంటుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.

ప్రస్తుతం ఇషాన్ గ్రేడ్ సిలో ఉన్నాడు. దీని ప్రకారం ప్రతి ఏటా అతడు రూ.కోటి అందుకుంటున్నాడు. రిషబ్ పంత్ కూడా అందుబాటులో లేకపోవడంతో పరిమిత ఓవర్ల క్రికెట్ లో కేఎల్ రాహుల్, టెస్టుల్లో కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తదుపరి వ్యాసం