Ishan Kishan Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడాలని ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ ఆదేశాలు.. అలా అయితేనే..
Ishan Kishan Ranji Trophy: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు పక్కన పెట్టిన అతన్ని.. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Ishan Kishan Ranji Trophy: ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీలో ఆడతాడా? అలా అయితేనే అతన్ని ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసిందా? కేఎల్ రాహుల్ పై టెస్టుల్లో కీపింగ్ భారాన్ని తగ్గించడం కోసమే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందా? తాజాగా వస్తున్న వార్తలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ తో గురువారం (జనవరి 11) నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇషాన్ ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
అలసిపోయానంటూ లీవ్ తీసుకొని దుబాయ్ లో పార్టీ చేసుకున్నందుకే బీసీసీఐ.. ఇషాన్ కిషన్ పై చర్యలు తీసుకుందని మొదట వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, ఈ సిరీస్ కు తాను అందుబాటులో ఉండనని ఇషాన్ చెప్పినందుకే ఎంపిక చేయలేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. అయితే తాజాగా ఇషాన్ ను రంజీ ట్రోఫీ ఆడాల్సిందిగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసమేనా?
రిషబ్ పంత్ జట్టుకు దూరమైనప్పటి నుంచీ టెస్టుల్లో వికెట్ కీపింగ్ స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ కు సవాలుగా మారింది. ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను తీసుకున్నా.. అతడు నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్, తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. దీంతో సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో కేఎల్ రాహుల్ కే వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.
కానీ టెస్టుల్లో కీపింగ్ అంటే రాహుల్ పై చాలా భారం పడుతుంది. టీ20లు, వన్డేల్లా ఇక్కడ కీపర్, బ్యాటర్ భారాన్ని మోయడం రాహుల్ కు అంత సులువు కాదు. దీంతో అతనిపై భారం తగ్గించాలని బీసీసీఐ భావిస్తోంది. పంత్ లేకపోవడం, భరత్ నిరాశపరచడంతో ఇషాన్ కిషన్ వైపు మేనేజ్‌మెంట్ చూస్తోంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో అతనికి అవకాశం ఇవ్వాలన్నది వాళ్ల ఆలోచనగా కనిపిస్తోంది.
అందుకే అంతకుముందు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాల్సిందిగా అతన్ని బోర్డు ఆదేశించింది. జార్ఖండ్ తరఫున జనవరి 19 నుంచి ప్రారంభం కాబోయే సీజన్ రెండో మ్యాచ్ లో ఇషాన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో రాణిస్తే ఇషాన్ కు లైన్ క్లియర్ అవుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ సిరీస్ కు తనను ఎంపిక చేయకపోతే ఇక అతడు నేరుగా ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ పైనే పూర్తిగా దృష్టి సారించనున్నాడు.
రాహుల్‌ను అందుకే వద్దంటున్నారా?
టీ20లు, వన్డేల్లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్ సమర్థంగా పోషిస్తున్నాడు. కానీ టెస్టుల్లో మాత్రం అది అంత సులువు కాదు. పైగా ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఇండియాలో జరగనుంది. ఇక్కడి స్పిన్ పిచ్ లపై అశ్విన్, జడేజాలాంటి బౌలర్లు చేసే టర్న్ ను వికెట్ల వెనుక అందుకోవడం కష్టం. దీనికోసం రెగ్యులర్, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయితేనే బాగుంటుందన్నది బోర్డు ఆలోచన.
అందుకే రాహుల్ ను కేవలం బ్యాటర్ గా తీసుకొని, కీపింగ్ బాధ్యతలు ఇషాన్ కిషన్ కు అప్పగించాలని చూస్తున్నారు. దానికి ముందు రంజీ ట్రోఫీతో కాస్త ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం వస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఇషాన్ ను అందులో ఆడాల్సిందిగా ఆదేశించినట్లు కనిపిస్తోంది.