KL Rahul: ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారు: కేఎల్ రాహుల్-kl rahul opened up about heavy criticism and abuse he faced ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul: ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారు: కేఎల్ రాహుల్

KL Rahul: ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారు: కేఎల్ రాహుల్

Hari Prasad S HT Telugu
Dec 28, 2023 01:44 PM IST

KL Rahul: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వీరోచిత సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. కొన్నాళ్ల కిందటి వరకూ తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించాడు. ఇప్పుడు పొగుడుతున్నారు కానీ.. అప్పుడందరూ దారుణంగా తిట్టారని అతడు గుర్తు చేసుకున్నాడు.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (PTI)

KL Rahul: ఐపీఎల్లో గాయపడి కోలుకొని వచ్చిన తర్వాత పూర్తి భిన్నమైన రాహుల్ ని అభిమానులు చూస్తున్నారు. ఆసియా కప్ లో సెంచరీ నుంచి తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ లో సెంచరీ వరకూ టీమిండియా కొత్త ఆపద్బాంధవుడిగా రాహుల్ నిలుస్తున్నాడు. దీంతో ఇప్పుడతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కొన్నాళ్ల కిందటి వరకూ తనను ఎంత దారుణంగా విమర్శించారో ఈ సందర్భంగా అతడు గుర్తు చేసుకున్నాడు.

వన్డే సిరీస్ లో కెప్టెన్ గా ఇండియాకు 2-1 విజయం సాధించి పెట్టడంతోపాటు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆదుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్.. విమర్శల కారణంగా తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో చెప్పాడు. "చాలా కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరికీ సొంత వ్యక్తిత్వం ఉంటుంది.

అందుకు తగిన లక్షణాలు ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పుడు వాటికి నిజమైన సవాలు ఎదురవుతుంది. ఓ వ్యక్తిగా, క్రికెటర్ గా ప్రతి రోజూ సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాతోనూ ఒత్తిడే. ఇవాళ నేను సెంచరీ చేశాను. దీంతో అందరూ నన్ను ప్రశంసిస్తున్నారు.

మూడు, నాలుగు నెలల కిందట అందరూ నన్ను తిట్టినవాళ్లే. ఆటలో ఇది భాగం. ఇది ఎలాంటి ప్రభావం చూపలేదని నేను చెప్పను. నాపై ప్రభావం చూపింది. అయితే వీటి నుంచి దూరంగా ఉండటం ఎంత త్వరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది" అని రాహుల్ అన్నాడు.

సోషల్ మీడియాను ఫాలో అవడంలో ఓ పరిమితి ఉండటం ముఖ్యమని అతడు అభిప్రాయపడ్డాడు. "తనపై వచ్చిన విమర్శలను పూర్తిగా పక్కన పెట్టేంత గొప్పోళ్లు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరినీ అది ప్రభావితం చేస్తుంది. తమపై ప్రభావం చూపలేదని ఎవరైనా చెబితే వాళ్లు అబద్ధం చెబుతున్నట్లే. నాకు గాయమై ఆట నుంచి చాలా కాలం దూరంగా ఉన్నప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాను. ఇలాంటి విషయాలతో ప్రభావితం కాకుండా ఉండేలా చూసుకున్నాను" అని రాహుల్ చెప్పాడు.

Whats_app_banner