India vs Afghanistan 1st T20I: ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి కోహ్లి దూరం.. ఇషాన్, శ్రేయస్ అందుకే తీసుకోలేదు: ద్రవిడ్
India vs Afghanistan 1st T20I: ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా గురువారం (జనవరి 11) ఆడబోయే తొలి టీ20కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. ఇక ఇషాన్, శ్రేయస్ ల గురించీ అతడు స్పందించాడు.
India vs Afghanistan 1st T20I: సుమారు 14 నెలల తర్వాత టీమిండియా టీ20 జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. ఆఫ్ఘనిస్థాన్ తో తొలి టీ20కి అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి ఈ మ్యాచ్ ఆడటం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. గురువారం (జనవరి 11) ఈ మ్యాచ్ జరగనుండగా.. బుధవారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
ఆఫ్ఘనిస్థాన్ తో ఇండియా మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియన్ టీమ్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే అనూహ్యంగా ఆఫ్ఘన్ సిరీస్ కు అతడు జట్టులోకి వచ్చినా.. తొలి మ్యాచ్ మాత్రం ఆడటం లేదు. ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 జట్టులోకి వచ్చాడు.
ఇషాన్, శ్రేయస్ ఎందుకు లేరంటే..
ఇక ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ కు రోహిత్, కోహ్లిల ఎంపికపైనే కాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లేకపోవడంపైనా చాలా విమర్శలు వచ్చాయి. తనకు బాగా లేదని చెప్పి ఇషాన్ దుబాయ్ లో పార్టీ చేసుకున్నాడని, అతనిపై బీసీసీఐ చర్యలు తీసుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ లో వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ ను తీసుకోకపోవడాన్నీ ఫ్యాన్స్ తప్పుబట్టారు.
ఈ ఇద్దరి విషయంపైనా కోచ్ ద్రవిడ్ స్పందించాడు. ఇషాన్ కిషన్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశాడు. "మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. ఇషాన్ విశ్రాంతి కోరాడు. తనకు తానే ఈ సిరీస్ కు అందుబాటులో లేడు. చాలా మంది బ్యాటర్లు ఉండటం వల్లే శ్రేయస్ ను తీసుకోలేదు. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేవు. అదంతా ఉత్తదే" అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
రోహిత్, యశస్వి ఓపెనింగ్
ఇక ఆఫ్ఘనిస్థాన్ తో జరగనున్న తొలి టీ20లో రోహిత్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా వస్తారని కూడా ఈ సందర్భంగా ద్రవిడ్ వెల్లడించాడు. దీంతో శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో రానున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు ఇండియా ఈ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది జూన్ 1న ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా ఆడనున్న చివరి టీ20 సిరీస్ ఇదే.
తొలి టీ20లో రోహిత్, జైస్వాల్ ఓపెనింగ్ చేయనుండగా.. గిల్ మూడు, తిలక్ నాలుగు, రింకు ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ స్థానం కోసం జితేష్, సంజూ మధ్య పోటీ నెలకొంది.
ఈ సిరీస్ కు రోహిత్, కోహ్లిలను ఎంపిక చేసిన బీసీసీఐ.. వరల్డ్ కప్ లోనూ ఈ ఇద్దరూ ఉండబోతున్నారని చెప్పకనే చెప్పింది. నిజానికి ఈ సీనియర్లు లేకపోయినా.. 14 నెలలుగా టీ20ల్లో ఇండియన్ టీమ్ మంచి విజయాలు సాధిస్తోంది. జైస్వాల్, గిల్, తిలక్ వర్మ, రుతురాజ్, రింకులాంటి యువకులు రాణిస్తున్నారు. ఇప్పుడీ ఇద్దరు సీనియర్లు రావడంతో ఎవరిపై వేటు వేస్తారో అన్న చర్చ మొదలైంది.