Gavaskar on Pant: పంత్ ఒంటి కాలితోనే మ్యాచ్‌ను మార్చేస్తాడు.. నా ఓటు అతనికే: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-gavaskar on pant says if he is fit even with one leg he can be a game changer ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Pant: పంత్ ఒంటి కాలితోనే మ్యాచ్‌ను మార్చేస్తాడు.. నా ఓటు అతనికే: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gavaskar on Pant: పంత్ ఒంటి కాలితోనే మ్యాచ్‌ను మార్చేస్తాడు.. నా ఓటు అతనికే: గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jan 10, 2024 04:36 PM IST

Gavaskar on Pant: వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. అతడు ఒంటికాలితో ఫిట్ గా ఉన్నా కూడా రాహుల్ కంటే అతనికే తాను ప్రాధాన్యత ఇస్తానని అనడం విశేషం.

రిషబ్ పంత్, సునీల్ గవాస్కర్, కేఎల్ రాహుల్
రిషబ్ పంత్, సునీల్ గవాస్కర్, కేఎల్ రాహుల్ (AP-AFP-HT)

Gavaskar on Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంతో టీమ్ కు దూరమై ఏడాది దాటింది. అయినా అతనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒంటికాలితోనూ అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడని తాజాగా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అనడం విశేషం. పంత్ సగం ఫిట్ గా ఉన్నా కూడా కేఎల్ రాహుల్ కంటే టీ20 వరల్డ్ కప్ కోసం తాను అతనికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు.

రిషబ్ పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ గా అన్ని ఫార్మాట్లలోనూ కేఎల్ రాహుల్ టీమ్ లో సెటిలయ్యాడు. బ్యాట్ తోనూ, వికెట్ల వెనుక కూడా రాణిస్తున్నాడు. ధోనీ తర్వాత డీఆర్ఎస్ విషయంలో ఆ స్థాయి మార్క్ చూపిస్తున్నాడు. అయినా కూడా గవాస్కర్ మాత్రం రాహుల్ కంటే పంత్ కే ఓటేయడం గమనార్హం. స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో అతడు మాట్లాడాడు.

ఒక్క కాలితో పంత్ ఫిట్‌గా ఉన్నా..

రిషబ్ పంత్ ఒక్క కాలితో ఫిట్ గా ఉన్నా కూడా అతనికే అవకాశం ఇవ్వాలని సన్నీ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్, బ్యాటర్ గా రాహుల్ పాత్రపై ప్రశ్నించగా.. గవాస్కర్ ఇలా స్పందించాడు. "రాహుల్ కూడా వికెట్ కీపరే. కానీ అంతకంటే ముందు నేను చెప్పేది ఏంటంటే.. రిషబ్ పంత్ ఒక్క కాలితో ఫిట్ గా ఉన్నా కూడా అతడు జట్టులోకి రావాల్సిందే. ప్రతి ఫార్మాట్లోనూ అతడో గేమ్ ఛేంజర్. నేను సెలక్టర్ అయితే మాత్రం పంత్ పేరే మొదట పెడతాను" అని అన్నాడు.

పంత్ లేకపోతే మాత్రం రాహులే ఉండాలన్నాడు. "ఒకవేళ రిషబ్ పంత్ లేకపోతే మాత్రం కేఎల్ రాహులే వికెట్ కీపర్ గా ఉండాలి. అదే మంచిది. ఎందుకంటే టీమ్ బ్యాలెన్స్ కూడా కుదురుతుంది. అతన్ని ఓపెనర్ గా ఆడించవచ్చు లేదంటే ఫినిషర్ గా ఐదు లేదా ఆరో స్థానంలో ఆడించొచ్చు" అని గవాస్కర్ చెప్పాడు. ఓ వికెట్ కీపర్ గా రాహుల్ బాగా మెరుగయ్యాడని అన్నాడు.

అంతేకాదు టీ20 వరల్డ్ కప్ రేసులో యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ పేరును కూడా కొట్టిపారేయలేమని చెప్పాడు. "ప్లేయర్స్ మధ్య పోటీ మంచిదే. ఈ ముగ్గురు ప్లేయర్స్ బాగా ఆడతారు. జితేష్ శర్మను కూడా మనం చూశాం. అతడో మంచి స్ట్రైకర్, ఫినిషర్. టీ20 క్రికెట్ లో వికెట్ కీపర్లు స్టంప్స్ కు కాస్త దూరంగా ఉంటారు. అందువల్ల అంతగా వికెట్ కీపింగ్ నైపుణ్యం లేకపోయినా బ్యాటింగ్ బాగా చేసి, ఫామ్ లో ఉంటే టీమ్ లో ఉండొచ్చు" అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది జూన్ 1న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 9న పాకిస్థాన్ తో ఇండియా తలపడనుంది. మరోవైపు ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ తో మళ్లీ ఫీల్డ్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ మెగా లీగ్ లో పంత్ రాణిస్తే.. టీ20 వరల్డ్ కప్ రేసులో అతడు ఉంటాడు.

Whats_app_banner