Gavaskar to Rohit Sharma: ఇంట్లో కూర్చోవడం కంటే ఆ మ్యాచ్‌లు ఆడటం మంచిదే కదా: రోహిత్‌కు గవాస్కర్ సూచన-gavaskar to rohit sharma suggests play some practice games than sitting at home ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar To Rohit Sharma: ఇంట్లో కూర్చోవడం కంటే ఆ మ్యాచ్‌లు ఆడటం మంచిదే కదా: రోహిత్‌కు గవాస్కర్ సూచన

Gavaskar to Rohit Sharma: ఇంట్లో కూర్చోవడం కంటే ఆ మ్యాచ్‌లు ఆడటం మంచిదే కదా: రోహిత్‌కు గవాస్కర్ సూచన

Hari Prasad S HT Telugu
Jan 05, 2024 02:59 PM IST

Gavaskar to Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కీలకమైన సూచన చేశాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. ఈ ఏడాది చివర్లో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చెప్పాడు.

సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ
సునీల్ గవాస్కర్, రోహిత్ శర్మ (Getty-PTI)

Gavaskar to Rohit Sharma: కేప్‌టౌన్‌లో సౌతాఫ్రికాపై చారిత్రక విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కచ్చితంగా ప్రాక్టీస్ గేమ్స్ ఆడాలని సూచించాడు.

ఆ మ్యాచ్ లలో ఎలాగూ సెకండ్ రేట్ టీమ్స్ ను ఆడిస్తారు కాబట్టి.. ఆడటం వల్ల ఉపయోగం లేదని గతంలో రోహిత్ శర్మ అన్నాడు. అయితే గవాస్కర్ మాత్రం దీనిని తప్పుబట్టాడు. ఇంట్లో కూర్చోవడం కంటే ఆ మ్యాచ్ లైనా ఆడటం మంచిదే కదా అని అతడు అనడం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికాతో సిరీస్ నాలుగు ఇన్నింగ్స్ లోనూ రోహిత్ శర్మ బ్యాట్ తో విఫలమైన నేపథ్యంలో సన్నీ ఈ సూచన చేశాడు.

ఆస్ట్రేలియా టూర్‌కు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

సౌతాఫ్రికా గడ్డపై ఈసారి కూడా సిరీస్ గెలవలేకపోవడంలో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడకపోవడమే కారణమన్నది గవాస్కర్ అభిప్రాయం. వాటిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దని సన్నీ స్పష్టం చేశాడు. "SENA దేశాల్లో ఇండియా సిరీస్ ఎలా మొదలుపెడుతుందో సెంచూరియన్ టెస్ట్ ఓటమితో తెలుస్తోంది. తొలి టెస్ట్ ఓడిన తర్వాత పుంజుకుంటారు. విదేశాల్లో మరో పెద్ద సిరీస్ ఏడాది తర్వాత ఆస్ట్రేలియా రూపంలో రానుంది.

గత రెండు పర్యటనల్లోనూ ఇక్కడ విజయాలు సాధించారు. ఇప్పుడూ అదే కొనసాగాలంటే ప్లానింగ్ ఇప్పటి నుంచే ప్రారంభం కావాలి. అంతకుముందు సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో స్వదేశంలో ఐదు టెస్టులు ఇండియా ఆడనుంది. డిసెంబర్ లో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఆ గ్యాప్ లో ఒకటో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లు అక్కడ ఆడే వీలుంటుంది. సెంచూరియన్ ఓటమి తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని అన్నాడు.

కానీ ఇంట్లో కూర్చోవడం కంటే ప్రత్యర్థితో పోరుకు ముందు ఆ మాత్రం ప్రాక్టీస్ అయినా లభిస్తుంది కదా? బ్యాటర్లే కాదు.. బౌలర్లు కూడా రిథమ్ అందుకోవడానికి ఉపయోగపడుతుంది" అని స్పోర్ట్స్‌స్టార్ కు రాసిన కాలమ్ లో గవాస్కర్ అన్నాడు.

ఇంగ్లండ్ తో 2021లో చివరి టెస్టు కోసం వెళ్లినప్పుడు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండు ఫైనల్స్ కు ముందు ఎలాంటి వామప్ లేకుండా బరిలోకి దిగి ఇండియా ఓడిపోయిన విషయాన్ని గవాస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అందువల్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో మాట్లాడి.. అక్కడి నేషనల్ ఛాంపియన్స్ లేదా ఎ టీమ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఏర్పాటు చేయాలని బీసీసీఐ కోరాలని సన్నీ సలహా ఇచ్చాడు.

డిసెంబర్ తొలి లేదా రెండో వారంలో ఈ మ్యాచ్ లను ఆడించాలని సూచించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో బీసీసీఐకి మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి.. ఇది సాధ్యమే అన్నది గవాస్కర్ అభిప్రాయం.

Whats_app_banner