Team India Historic Win: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చారిత్రక విజయం.. సిరీస్ 1-1తో సమం-team india historic win on south africa soil after siraj and bumrah heroics ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Historic Win: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చారిత్రక విజయం.. సిరీస్ 1-1తో సమం

Team India Historic Win: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా చారిత్రక విజయం.. సిరీస్ 1-1తో సమం

Hari Prasad S HT Telugu
Jan 04, 2024 05:12 PM IST

Team India Historic Win: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. రెండు రోజులు కూడా ముగియక ముందే కేవలం 642 బంతుల్లోనే కేప్‌టౌన్ టెస్టును ముగించడం గమనార్హం. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం చేసింది.

సౌతాఫ్రికాను 7 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాను 7 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా (PTI)

Team India Historic Win: సౌతాఫ్రికా గడ్డపై చారిత్రక విజయం సాధించింది టీమిండియా. కేప్‌టౌన్ లో ఇప్పటి వరకూ సాధ్యం కాని విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవకపోయినా.. 2010లో ధోనీ తర్వాత సిరీస్ ను సమం చేసిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రెండు రోజుల్లోపే ముగిసిన ఈ రెండో టెస్టులో 7 వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ ఇదే. కేవలం 107 ఓవర్ల (642 బంతులు)లోనే మ్యాచ్ ముగిసింది.

79 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. ఆ టార్గెట్ ను 12 ఓవర్లలోనే సులువుగా చేజ్ చేసింది. రోహిత్ శర్మ 17, శ్రేయస్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపెనర్లు యశస్వి, రోహిత్ ధాటిగా ఆడి మొదట్లోనే సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచడంతో టీమిండియా విజయం సులువైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్ లోనూ 176 పరుగులే చేయగలిగింది.

ఇండియన్ టీమ్ తరఫున తొలి ఇన్నింగ్స్ లో మహ్మద్ సిరాజ్, రెండో ఇన్నింగ్స్ బుమ్రా ఆరేసి వికెట్లు తీసుకోవడం విశేషం. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఓపెనర్ ఏడెన్ మార్‌క్రమ్ (106) వీరోచిత సెంచరీ చేసినా.. అది వృథా అయిపోయింది.

సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. మొదట టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. తర్వాత వన్డే సిరీస్ ను 2-1తో గెలిచింది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. మొత్తానికి ఒక్క సిరీస్ కోల్పోకుండా కఠినమైన సౌతాఫ్రికా సిరీస్ ముగించడం నిజంగా విశేషమే. కొత్త ఏడాదికి కూడా ఇది అదిరిపోయే ఆరంభమే.

తొలి రోజే 23 వికెట్లు..

కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో పేస్ కు అనుకూలించిన పిచ్ పై తొలి రోజే రెండు జట్లు కలిపి 23 వికెట్లు పడగొట్టడం విశేషం. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి రోజే 25 వికెట్లు పడిన తర్వాత.. ఇదే అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు తొలి సెషన్ లోనే కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.

తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియన్ టీమ్ 153 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగులు ఆధిక్యం సంపాదించింది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఇది చాలా మంది ఆధిక్యమే. తర్వాత సౌతాఫ్రికాలో 176 రన్స్ చేయడంతో చివరికి విజయానికి కేవలం 79 రన్స్ మాత్రమే అవసరమయ్యాయి. దానిని సులువగా చేజ్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో కీలకమైన విజయం సాధించింది.

Whats_app_banner