Rohit Sharma: కోహ్లీ ఉండగా రోహిత్ శర్మ ఎందుకు?: టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma: భారత టెస్టు జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేస్తుండటంపై మాజీ ప్లేయర్ సుబ్రమణియం బద్రీనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హిట్‍మ్యాన్‍పై మరిన్ని కామెంట్లు చేశాడు. ఆ వివరాలివే..
Rohit Sharma: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విఫమయ్యాడు. కగిసో రబాడ బౌలింగ్‍లో తొలి ఇన్నింగ్స్‌లో పుల్ షాట్‍ను కంట్రోల్ చేయలేక ఔటైన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో అతడి బౌలింగ్‍లోనే బౌల్డ్ అయ్యాడు. అలాగే, తొలి టెస్టులో కెప్టెన్సీ విషయంలోనూ రోహిత్ శర్మ తేలిపోయాడనే అభిప్రాయాలు వచ్చాయి. ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ధారాళంగా పరుగులు ఇస్తున్న సమయంలో.. స్ట్రైక్ బౌలర్లైన జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‍ను సరిగా రొటేట్ చేయలేకపోయాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‍లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమి తర్వాత కొందరు మాజీలు రోహిత్ శర్మపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ జాబితాలోకి టీమిండియా మాజీ బ్యాటర్ సుబ్రమణియం బద్రీనాథ్ చేరాడు.
టెస్టు క్రికెట్‍లో రోహిత్ శర్మ కంటే ఎంతో మెరుగైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్సీ చేయాలని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. టెస్టు జట్టులో కోహ్లీ ఉండగా.. రోహిత్‍కు కెప్టెన్సీ ఇవ్వడం సరైనది కాదని తన యూట్యూబ్ ఛానెల్‍లో అన్నాడు. విదేశాల్లో సరైన రికార్డు లేని రోహిత్ టెస్టు జట్టులో ఎందుకంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
“టెస్టు కెప్టెన్‍గా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కెప్టెన్‍గా అతడు 52 యావరేజ్‍తో 5వేలకుపైగా పరుగులు చేశాడు. 68 టెస్టు మ్యాచ్‍లకు అతడు కెప్టెన్సీ చేయగా.. 40 గెలుపులు, 17 ఓటములు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో అద్భుతమైన టెస్టు సిరీస్ గెలుపు అతడి సారథ్యంలో వచ్చింది. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత కెప్టెన్‍గా అత్యధిక టెస్టు విజయాలు ఉన్నది విరాట్ కోహ్లీకే” అని బద్రీనాథ్ చెప్పాడు.
“టెస్టు జట్టుకు అతడు (విరాట్ కోహ్లీ) ఎందుకు కెప్టెన్‍గా లేడు. ఈ ప్రశ్నను నేను లేవనెత్తాలనుకుంటున్నా. అతడు గొప్ప టెస్టు బ్యాటర్. విరాట్ కోహ్లీకి, రోహిత్‍కు పోలీకే లేదు. టెస్టు క్రికెట్‍లో అతడు చాలా గొప్ప ప్లేయర్. ప్రతీ చోట అతడు పరుగులు చేశాడు. అతడు ఎందుకు సారథ్యం వహించడం లేదా వీక్ ప్లేయర్ ఎందుకు చేస్తున్నాడు? ఇండియా బయట ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇంకా నిరూపించుకోలేదు. అతడు జట్టులో (టెస్టు) ఎందుకు ఉన్నాడు?” అని బద్రీనాథ్ అన్నాడు.
టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత 2022 జనవరిలో టెస్టు సారథ్యం నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. దీంతో భారత కెప్టెన్సీ బాధ్యత నుంచి పూర్తిగా వైదొలిగి.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే, కోహ్లీ సారథ్యంలో టెస్టు క్రికెట్‍లో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జనవరి 3న మొదలుకానుంది. రెండు మ్యాచ్‍ల సిరీస్‍లో తొలి టెస్టు ఓడి 0-1తో భారత్ వెనుకబడింది. ఈ రెండో టెస్టు గెలిస్తేనే సిరీస్ సమం చేసుకోగలుగుతుంది.
సంబంధిత కథనం