Ishan Kishan: వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి గెలిపించిన ఇషాన్ కిషన్.. సెంచరీ చేసిన టీమిండియా వికెట్ కీపర్
18 August 2024, 14:57 IST
- Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి నేషనల్ సెలక్టర్లకు తన సత్తా ఏంటో చూపించాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా మధ్య ప్రదేశ్ తో మ్యాచ్ లో వరుసగా రెండు సిక్స్ లు కొట్టి జార్ఖండ్ ను గెలిపించిన అతడు.. టెస్ట్ టీమ్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి గెలిపించిన ఇషాన్ కిషన్.. సెంచరీ చేసిన టీమిండియా వికెట్ కీపర్
Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి బ్యాట్ తో సత్తా చాటాడు. ఈ ఏడాది మొదట్లో జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడనందుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన అతడు.. తాజాగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో చెలరేగాడు. మధ్య ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చేతిలో రెండే వికెట్లు ఉన్న సమయంలో రెండు సిక్స్ లు బాది తన టీమ్ జార్ఖండ్ ను అతడు గెలిపించాడు.
12 పరుగులు.. చేతిలో రెండే వికెట్లు..
బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ ద్వారా చాలా కాలం తర్వాత ఇషాన్ కిషన్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. అయితే వచ్చీ రాగానే అతడు టీమిండియా టెస్ట్ టీమ్ లోకి రావడానికి అవసరమైన గట్టి ఇన్నింగ్సే ఆడాడు. మధ్య ప్రదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే అతడు సెంచరీ చేశాడు. దీంతో జార్ఖండ్ కు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 64 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతేకాదు చేజింగ్ లో ఆ టీమ్ మిడిలార్డర్ కుప్పకూలగా.. చివరి వరకూ క్రీజులో ఉండి రెండు సిక్స్ లతో గెలిపించాడు. 174 పరుగుల ఛేదనలో జార్ఖండ్ టీమ్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. చివరికి విజయానికి 12 పరుగులు అవసరం కాగా.. చేతిలో రెండే వికెట్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇషాన్ తనదైన స్టైల్లో ఎంతో కామ్ గా కనిపిస్తూ రెండు సిక్స్ లు బాదేసి జార్ఖండ్ ను గెలిపించాడు.
మధ్య ప్రదేశ్ స్పిన్నర్ ఆకాశ్ రజావత్ వేసిన 55వ ఓవర్ రెండో బంతి, నాలుగో బంతికి సిక్స్ లు బాదిన ఇషాన్.. రెండు వికెట్లతో జార్ఖండ్ కు విజయం సాధించి పెట్టడం విశేషం. నిజానికి ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అతడు కేవలం 107 బంతుల్లోనే 114 రన్స్ చేశాడు.
మళ్లీ టీమిండియాలోకి వస్తాడా?
ఇషాన్ కిషన్ గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికా టూర్ ను మధ్యలోనే వదిలేసి ఇంటికి వచ్చేసిన అతడు.. అప్పటి నుంచీ ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడు. బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినా కూడా జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడలేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టుల్లో బీసీసీఐ అతనికి అవకాశం ఇవ్వలేదు.
అటు ఐపీఎల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ వైఫల్యం కూడా ఆ టీమ్ వరుస ఓటములకు కారణమైంది. ఈ సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై టీమ్.. చివరి స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అటు రిషబ్ పంత్ కూడా తిరిగా రావడంతో క్రమంగా ఇషాన్ కిషన్ ను సెలక్టర్లు పూర్తిగా పట్టించుకోలేదు. అయితే తాజాగా రెడ్ బాల్ క్రికెట్ కు తిరిగి వచ్చి సత్తా చాటిన అతడు.. మరోసారి టీమిండియా తలుపు తడుతున్నాడు.