Ishan Kishan: సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. టీమిండియా సెలెక్టర్లను మెప్పించేలా!
Ishan Kishan: భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ టోర్నీలో సెంచరీతో చెలరేగాడు. మళ్లీ భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఈ ప్లేయర్.. అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
భారత యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ బీసీసీఐకి ఆగ్రహం తెప్పించి టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాళీ రంజీ ట్రోఫీ ఆడాలని ఆదేశించినా.. పెడచెవిన పెట్టి వేటుకు గురయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును అతడు కోల్పోయాడు. అయితే, మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు ఇషాన్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం అతడు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‍లో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ తరఫున నేడు (ఆగస్టు 16) సెంచరీతో దుమ్మురేపాడు ఇషాన్.
వరుస సిక్స్‌లతో సెంచరీకి..
మధ్యప్రదేశ్‍తో జరుగుతున్న మ్యాచ్‍లో సెంచరీతో కదం తొక్కాడు ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజైన నేడు కిషన్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా ఆ తర్వాత చితకబాదేశాడు.
61 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాతి 39 బంతుల్లోనే ఏకంగా తొమ్మిది సిక్స్‌లతో చెలరేగాడు. మోత మెగించాడు. దీంతో 86 బంతుల్లోనే కిషన్ సెంచరీ చేరాడు. వరుసగా రెండు సిక్స్‌లతో సెంచరీ మార్క్ చేరాడు ఈ యంగ్ స్టార్ బ్యాటర్. మొత్తంగా 107 బంతుల్లో 114 పరుగులతో కిషన్ దుమ్మురేపాడు. దీంతో జార్ఖండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ టోర్నీలో జార్ఖండ్‍కు కిషనే కెప్టెన్సీ చేస్తున్నాడు.
సెలెక్టర్లను మెప్పించేలా!
బంగ్లాదేశ్‍తో టీమిండియా టెస్టు సిరీస్ సెప్టెంబర్‌లో షురూ కానుంది. ఆ సిరీస్‍లో చోటు దక్కించుకోవాలని ఇషాన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, మళ్లీ అతడు జట్టులోకి రావాలంటే బీసీసీఐ సెలెక్టర్లను మెప్పించాల్సిందే. తన ఫామ్ నిరూపించుకోవాల్సిందే. అందులో భాగంగా బుచ్చిబాబు టోర్నీలో ఇప్పుడు సెంచరీ చేసి తొలి అడుగు వేశాడు కిషన్. సెలెక్టర్లను మెప్పించేలా ఆడాడు. అయితే, కిషన్‍కు దులీప్ ట్రోఫీనే అత్యంత కీలకంగా ఉంది. సెప్టెంబర్ ఆరంభంలో మొదలయ్యే ఈ దేశవాళీ టోర్నీలో కిషన్‍కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలోనూ జార్ఖండ్ తరఫున ఇషాన్ బరిలోకి దిగనున్నాడు.
కిషన్ మళ్లీ భారత జట్టులోకి రావాలంటే దులీప్ ట్రోఫీలో తప్పకుండా రాణించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ టోర్నీ ముందే.. సన్నాహకంగా ఇప్పుడు బుచ్చిబాటు టోర్నీలో ఇషాన్ బరిలోకి దిగాడు. దులీప్ ట్రోఫీలో రాణిస్తే బంగ్లాతో టెస్టు సిరీస్‍తో అతడు మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలోనూ బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది.
మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడకుండానే మధ్యలో వైదొలిగాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో అతడిని అప్పటి నుంచి బీసీసీఐ పక్కన పెట్టేసింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తీసేసింది. ఏ సిరీస్‍కు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది జూన్‍లో జరిగిన టీ20 ప్రపంచకప్‍లోనూ ఇషాన్‍కు ప్లేస్ దక్కలేదు. అయితే, అతడిని మళ్లీ పరీక్షించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్‍తో సిరీస్‍లో భారత జట్టులో ఇషాన్ చోటు దక్కించుకోవాలంటే దులీప్ ట్రోఫీలో బాగా ఆడాలి. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ధృవ్ జురెల్ పోటీలో ఉన్నారు.