IND vs SL 3rd ODI: చేతులెత్తేసి ఘోరంగా ఓడిన టీమిండియా.. శ్రీలంకదే సిరీస్.. 27 ఏళ్ల తర్వాత ఇలా..
IND vs SL 3rd ODI: శ్రీలంక చేతిలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. మూడో వన్డేలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్‍ను లంక కైవసం చేసుకుంది.
సొంతగడ్డపై శ్రీలంక గర్జించింది. మూడో వన్డేలో టీమిండియాను కుప్పకూల్చి సిరీస్ కైవసం చేసుకుంది. లక్ష్యఛేదనలో టపటపా వికెట్లు చేజార్చుకొని కుప్పకూలింది భారత్. కేవలం 138 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా నేడు (ఆగస్టు 7) జరిగిన మూడో వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. 2-0తో సిరీస్ గెలిచింది లంక. ఈ పర్యటనను భారీ పరాజయంతో ముగించింది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.
27 ఏళ్ల తర్వాత..
ఈ సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది శ్రీలంక. 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‍లో భారత్‍ను శ్రీలంక ఓడించింది. 1997లో టీమిండియాపై లంక సిరీస్ గెలిచింది. ఆ తర్వాతి నుంచి అన్ని వన్డే ద్వైపాక్షిక సిరీస్‍లను టీమిండియానే కైవసం చేసుకుంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత భారత్‍పై వన్డే సిరీస్ టైటిల్ గెలిచింది లంక.
విజృభించిన వెల్లలాగే.. కుప్పకూలిన భారత్
249 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా కుప్పకూలింది. 26.1 ఓవర్లలో కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు, ఓ సిక్స్), వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 30 పరుగులు), విరాట్ కోహ్లీ (18 బంతుల్లో 20 పరుగులు) మాత్రమే కాసేపు నిలువగలిగారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‍కే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. భారత ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (6) త్వరగానే ఔట్ కాగా.. రోహిత్ శర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (20) కూడా ఉన్నంత సేపు బాగా ఆడాడు.
8వ ఓవర్లో రోహిత్ శర్మను వెల్లలాగే ఔట్ చేశాడు. రిషబ్ పంత్ (6)ను తీక్షణ పెవిలియన్‍కు పంపాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని అతడే 11వ ఓవర్లో ఔట్ చేసి దెబ్బకొట్టాడు వెల్లలాగే . అక్షర్ పటేల్‍ను 13వ ఓవర్లో అతడే బౌల్డ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (8) ఎక్కువ సేపు నిలువలేదు. దీంతో 53/1 నుంచి 82/6కు భారత్ కుప్పకూలింది. 29 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయింది. ఎదురు దాడి చేసేందుకు యత్నించిన రియాన్ పరాగ్ (15)ను లంక స్పిన్నర్ వాండర్సే ఔట్ చేశాడు. శివమ్ దూబే (9) మరోసారి విఫలమయ్యాడు.
వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీటుగా ఆడాడు. అతడికి కుల్దీప్ యాదవ్ (30 బంతుల్లో 6 పరుగులు) తోడుగా నిలిచాడు. సుందర్ నిలువడంతో భారత్ ఆ స్కోరైనా చేయగలిగింది. అతడు ఔటయ్యాక కుల్దీప్ కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో 138 పరుగులకే భారత్ కుప్పకూలి ఓడింది.
శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 5.1 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. భారత బ్యాటింగ్ లైనప్‍ను కూల్చాడు. మహీశ్ తీక్షణ, జెఫ్రీ వండర్సే తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అషిత ఫెర్నాండో ఓ వికెట్ తీశాడు.
దుమ్మురేపిన అవిష్క, కుషాల్
అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 102 బంతుల్లో 96 పరుగులతో అదరగొట్టాడు. కాస్తలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కుషాల్ మెండిస్ (82 బంతుల్లో 59 పరుగులు) అర్ధ శతకంతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ తీశారు.
టీమిండియా హెడ్‍కోచ్‍గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు ఇది తొలి పర్యటన. లంకపై టీ20 సిరీస్‍ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. 0-2తో వన్డే సిరీస్‍ను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‍లో మూడు మ్యాచ్‍ల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి వన్డే టై కాగా.. తదుపరి రెండింటిని లంక గెలిచింది.