BCCI Contracts: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు.. గిల్‍కు ప్రమోషన్.. యశస్వి, తిలక్‍కు చోటు-bcci announces central contract for players shreyas iyer ishan kishan dropped shubhman gill promoted yashasvi jaiswal in ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Bcci Contracts: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు.. గిల్‍కు ప్రమోషన్.. యశస్వి, తిలక్‍కు చోటు

BCCI Contracts: ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు.. గిల్‍కు ప్రమోషన్.. యశస్వి, తిలక్‍కు చోటు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2024 07:12 PM IST

BCCI Annual Central Contracts: వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ వెల్లడించింది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శుభ్‍మన్ గిల్‍కు గ్రూప్-ఏలో ప్రమోషన్ వచ్చింది.

BCCI Contracts:  ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు.. గిల్‍కు ప్రమోషన్ (PTI)
BCCI Contracts:  ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై వేటు.. గిల్‍కు ప్రమోషన్ (PTI)

BCCI Central Contracts: ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. ఈ సంవత్సరానికి నాలుగు గ్రూప్‍లుగా ఆటగాళ్ల కాంట్రాక్టులను నేడు (ఫిబ్రవరి 28) ప్రకటించింది. భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఇటీవల దేశవాళీ క్రికెట్‍కు డుమ్మా కొట్టిన ఈ ఇద్దరినీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది.

ఇద్దరిపై వేటు

వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే ఇషాన్ కిషన్ భారత్‍కు తిరిగి వచ్చేశాడు. అయితే, మళ్లీ సెలెక్షన్‍కు అందుబాటులోకి రాలేదు. మళ్లీ జట్టులోకి రావాలంటే దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా బీసీసీఐ కూడా సంకేతాలు ఇచ్చినా ఇషాన్ పెడచెవిన పెట్టాడు. రంజీ మ్యాచ్‍లకు డుమ్ము కొట్టాడు. ఈ కారణంగానే సెంట్రల్ కాంట్రాక్టులో ఇషాన్‍ కిషన్‍ను బీసీసీఐ తొలగించినట్టు అర్థమవుతోంది. ఇటీవల ముంబై తరఫున రంజీ మ్యాచ్‍ను శ్రేయస్ అయ్యర్ ఆడలేదు. అతడు గాయమని చెప్పినా.. అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తెలిసింది. ఆ తరుణంలో శ్రేయస్‍ను కూడా కాంట్రాక్ట్‌ నుంచి తప్పించడం అనూహ్యంగా మారింది.

వీరు కూడా ఔట్

భారత సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారను కూడా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ తప్పించింది. యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్, దీపక్ హూడా, ఉమేశ్ యాదవ్ కూడా కాంట్రాక్టులో చోటు దక్కలేదు.

బీసీసీఐ సెంట్రల్ గ్రేడ్ ఏ+ కాంట్రాక్టుల్లో రోహిత్ శర్మ సహా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. గ్రేడ్ ఏలో ఆరుగురు, గ్రేడ్ బీలో ఐదుగురు, గ్రేడ్ సీలో 15 మంది ప్లేయర్లు ఉన్నారు. భారత యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్‍ ప్రమోషన్ పొంది గ్రేడ్-ఏకు వచ్చేశాడు. యువ స్టార్ యశస్వి జైస్వాల్ గ్రేడ్-బీలో చోటు దక్కించుకున్నాడు. పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే

గ్రేడ్-ఏ+ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్-ఏ : మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్‍మన్ గిల్

గ్రేడ్-బీ: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్‍దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్

గ్రేడ్-సీ: తిలక్ వర్మ, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, ముకేశ్ కుమార్, రజత్ పాటిదార్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ

కొత్తగా 10 మంది

ఈసారి కొత్తగా 10 మంది ఆటగాళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది. తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, ముకేశ్ కుమార్, రజత్ పాటిదార్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్నారు.

 

Whats_app_banner