Rohit Sharma: ఇండియన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రోహిత్ శర్మ కామెంట్స్.. ఆ ప్లేయర్స్‌పై నిషేధం తప్పదా?-rohit sharma hunger for runs comments causes stir in indian cricket state associations back his views cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ఇండియన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రోహిత్ శర్మ కామెంట్స్.. ఆ ప్లేయర్స్‌పై నిషేధం తప్పదా?

Rohit Sharma: ఇండియన్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రోహిత్ శర్మ కామెంట్స్.. ఆ ప్లేయర్స్‌పై నిషేధం తప్పదా?

Hari Prasad S HT Telugu

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రంజీ ట్రోఫీ ఆడని ప్లేయర్స్ పై నిషేధం విధించాలన్న డిమాండ్ రాష్ట్రాల అసోసియేషన్ల నుంచి వస్తుండటం గమనార్హం.

ఇండియన్ క్రికెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రోహిత్ శర్మ కామెంట్స్ (PTI)

Rohit Sharma: ఇంగ్లండ్ పై నాలుగో టెస్టు గెలిచిన తర్వాత రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు, రాష్ట్రాల అసోసియేషన్లు స్పందిస్తున్నాయి. పరుగులు చేయాలన్న ఆకలి ఉన్నవాళ్లకే ఇండియన్ టీమ్ చోటు దక్కుతుందని, మిగతా వాళ్లకు అవకాశం ఇవ్వబోమని రోహిత్ స్పష్టంగా చెప్పాడు. దీంతో రంజీ ట్రోఫీ ఆడని వారిపై నిషేధం విధించే అధికారం రాష్ట్రాల అసోసియేషన్లకు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది.

క్లబ్ vs కంట్రీ చర్చపై రోహిత్

ఎప్పుడైతే ఐపీఎల్ లాంటి లీగ్స్ ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయో అప్పటి నుంచే సాంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్ లకు గడ్డుకాలం మొదలైంది. కేవలం డబ్బు ఆశతో యువ ఆటగాళ్లు తమ జాతీయ జట్లను కూడా కాదనుకొని క్లబ్స్ వైపు వెళ్తున్నారు. తాజాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ పై దృష్టి సారిస్తున్నారు.

దీంతో బీసీసీఐ సెక్రటరీ జై షానే రంగంలోకి దిగి రంజీ ట్రోఫీ ఆడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా ఈ ఇద్దరిలో ఎలాంటి మార్పూ రాలేదు. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నాలుగో టెస్ట్ తర్వాత ఇలాంటి వార్నింగే ఇచ్చాడు. "ఎవరికైతే ఆకలి ఉందో వాళ్లే అవకాశం ఇస్తాం. అలా లేని వాళ్లకు అవకాశం ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు" అని రోహిత్ స్పష్టంగా చెప్పాడు.

అతని కామెంట్స్ ఇండియన్ క్రికెట్ లో ప్రకంపనలు సృష్టించాయి. సునీల్ గవాస్కర్, వెంగ్‌సర్కార్ లాంటి మాజీ క్రికెటర్లతోపాటు రాష్ట్రాల అసోసియేషన్లు కూడా రోహిత్ కామెంట్స్ ను సమర్థించడం గమనార్హం. ఎలాంటి ప్లేయర్ అయినా రంజీ ట్రోఫీ ఆడాల్సిందే అన్న స్పష్టమైన హెచ్చరిక రోహిత్ కామెంట్స్ లో కనిపిస్తోంది.

ఆ ప్లేయర్స్‌పై నిషేధం తప్పదా?

రోహిత్ కామెంట్స్ పై మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్ స్పందించాడు. "రంజీ ట్రోఫీ ఆడటం చాలా ముఖ్యం. అది ఇండియన్ వికెట్లపై స్పిన్ మెరుగ్గా ఆడేందుకు ఉపయోగపడుతుంది. ఈ టోర్నీ ఆడాలా వద్దా అన్నది ప్లేయర్స్ ఇష్టం. ఒకవేళ ఆడకపోతే దేశవ్యాప్తంగా ఆడిన వాళ్లు చాలా మందే ఉంటారు. వాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎవరూ ఆట కంటే గొప్పోళ్లు కాదు" అని వెంగ్‌సర్కార్ చాలా ఘాటుగా స్పందించాడు.

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిలాస్ కూడా స్పందించారు. "రోహిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. యువ క్రికెటర్లలో టెస్టులు ఆడాలన్న ఆ ఆకలి ఉండాలి. ఏ ప్లేయర్ అయినా రంజీ ట్రోఫీని తేలిగ్గా తీసుకోవద్దు. అది ఇండియన్ క్రికెట్ వెన్నెముకలాంటిది" అని అన్నారు. ఇక మరో రాష్ట్ర అసోసియేషన్ సభ్యుడు కూడా దీనిపై స్పందించారు.

"ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. ఓ ఇండియన్ ప్లేయర్ రెగ్యులర్ గా రంజీ ట్రోఫీ ఆడుతుంటే యువ ఆటగాళ్లకు మోటివేషన్ లా పని చేస్తుంది. రంజీ ట్రోఫీ ఆడని ప్లేయర్స్ పై నిషేధం విధించే అధికారం రాష్ట్రాల అసోసియేషన్లకు ఇవ్వాల్సిందిగా నేను బీసీసీఐని కోరుతున్నాను. ఓ సీనియర్ ప్లేయర్ ను పక్కన పెడితే జూనియర్ ప్లేయర్స్ లో భయం పుడుతుంది. అప్పుడు వాళ్లు రంజీ ట్రోఫీని తేలిగ్గా తీసుకోరు" అని సదరు వ్యక్తి అన్నారు.