Ishan Kishan: ఇషాన్ కిషన్‍కు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలోకి!-bcci to select ishan kishan for duleep trophy ahead of india vs bangladesh test series report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ishan Kishan: ఇషాన్ కిషన్‍కు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలోకి!

Ishan Kishan: ఇషాన్ కిషన్‍కు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలోకి!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 12, 2024 08:15 PM IST

Ishan Kishan: మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‍కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోకి జరగనున్న దేశవాళీ టోర్నీకి అతడిని బీసీసీఐ ఎంపిక చేస్తుందనే సమాచారం బయటికి వచ్చింది. బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్ ముందే ఈ టోర్నీ జరగనుంది. ఆ వివరాలివే..

Ishan Kishan: ఇషాన్ కిషన్‍కు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలోకి!
Ishan Kishan: ఇషాన్ కిషన్‍కు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైన బీసీసీఐ.. సద్వినియోగం చేసుకుంటే మళ్లీ టీమిండియాలోకి!

భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రంజీట్రోఫీ ఆడకుండా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించిన అతడికి సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కలేదు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి ఇషాన్ కిషన్ సడెన్‍గా తిరిగి వచ్చేశాడు. మానసిక ఆరోగ్యం కారణం చెప్పాడు. అయితే, దుబాయ్‍లో పార్టీ చేసుకున్నట్టు తేలింది. అలాగే, రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ చెప్పిన మాటను పట్టించుకోలేదు. దీంతో క్రమశిక్షణ చర్యలను బీసీసీఐ తీసుకుంది.

ఇషాన్ కిషన్‍ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ కాంట్రాక్టు నుంచి బీసీసీఐ తప్పించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ సహా ఏ సిరీస్‍కు తీసుకోలేదు. కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రెస్‍మీట్‍లో అతడి పేరు ప్రస్తావించలేదు. దీంతో ఇషాన్ కిషన్ మళ్లీ భారత జట్టులోకి రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కిషన్‍కు మరో అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయినట్టు తెలుస్తోంది.

దులీప్ ట్రోఫీలో చోటు

దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘దులీప్ ట్రోఫీ’కి ఇషాన్ కిషన్‍ను బీసీసీఐ ఎంపిక చేయనుందని తాజాగా రిపోర్టులు బయటికి వచ్చాయి. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీ కోసం ఈస్ట్ జోన్ జట్టులో కిషన్‍కు ప్లేస్ దక్కనుందని తెలుస్తోంది. ఈసారి ఈ దేశవాళీ టోర్నీలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నారు. భారత రెగ్యులర్ ప్లేయర్లు ఈ టోర్నీ ఆడాలని బీసీసీఐ కూడా సూచించింది.

బంగ్లాతో సిరీస్‍కు ముందు..

భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్‌ నెలలో రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 27 మధ్య ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‍కు ఆటగాళ్ల ఎంపికకు దులీప్ ట్రోఫీ కీలకంగా మారనుంది.

రాణిస్తే.. టీమిండియాలోకి ఇషాన్‍

దులీప్ ట్రోఫీలో రాణించి ఫామ్ ప్రదర్శిస్తే భారత జట్టులో ఇషాన్ కిషన్‍ను మళ్లీ తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తోందని తెలుస్తోంది. దులీప్ ట్రోఫీలో అదరగొడితే బంగ్లా టెస్టు సిరీస్‍కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరి, ఇషాన్ కిషన్ ఈ దులీప్ ట్రోఫీని సద్వినియోగం చేసుకుంటాడా అనేది చూడాలి.

కాగా, వచ్చే దేశవాళీ సీజన్‍ ఆడేందుకు ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‍సీఏ) అతడిని 25 మంది ప్రాబబుల్స్ లిస్టులో ఇప్పటికే చేర్చింది.

మరోవైపు, చెన్నైలో ఆగస్టు 15న మొదలుకానున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‍లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. మొత్తంగా కిషన్ మళ్లీ ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నాడని అర్థమవుతోంది. దులీప్ ట్రోఫీలో అదరగొడితే మళ్లీ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రేయస్ అయ్యర్ కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా అయ్యర్ మళ్లీ భారత జట్టులోకి వచ్చేశాడు. మరి ఇషాన్ కూడా రాగలడేమో చూడాలి.

Whats_app_banner