Ishan Kishan Effect: రంజీ ట్రోఫీలో ఆడితేనే ఐపీఎల్ ఆడనిస్తాం: బీసీసీఐ ఫిట్టింగ్ మామూలుగా లేదు
14 February 2024, 7:54 IST
Ishan Kishan Effect: ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ పని పట్టడానికి బీసీసీఐ అదిరిపోయే ప్లాన్ వేస్తోంది. రంజీ ట్రోఫీలో ఆడితేనే ఐపీఎల్లో ఆడినిస్తామన్న కఠినమైన నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించింది.
ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ కు చెక్ పెట్టడానికి రంజీ ట్రోఫీ, ఐపీఎల్ కు లింకు పెట్టనున్న బీసీసీఐ
Ishan Kishan Effect: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినా, తమ రాష్ట్ర టీమ్ ఎన్నిసార్లు కోరినా రంజీ ట్రోఫీ ఆడటానికి విముఖత చూపుతున్న ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ కోసం బీసీసీఐ అదిరిపోయే ప్లాన్ వేస్తోంది. రంజీ ట్రోఫీని కాదని నేరుగా ఐపీఎల్ పై దృష్టిసారించిన ఇషాన్ తోపాటు ఇతర ప్లేయర్స్ కు వార్నింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
రంజీ ఆడితేనే ఐపీఎల్
చాలా మంది యువ ప్లేయర్స్ డబ్బులు కురిపించే ఐపీఎల్ పైనే ఎక్కువగా దృష్టిసారిస్తూ రంజీ ట్రోఫీలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో రంజీ ట్రోఫీ ఆడితేనే ఐపీఎల్ ఆడనిస్తామన్న కొత్త నిబంధన తీసుకొచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు పీటీఐ రిపోర్టు వెల్లడించింది. ఐపీఎల్లో ఆడటం కాదు.. కనీసం మూడు, నాలుగు రంజీ మ్యాచ్ లు ఆడకపోతే వేలంలో పాల్గొనే అవకాశం కల్పించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
ఇషాన్ కిషన్ రెండు నెలలుగా ఎవరి మాటా వినకుండా రంజీ ట్రోఫీలో తన జార్ఖండ్ టీమ్ కు దూరంగా ఉంటుండడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే అతన్ని ఫిబ్రవరి 16 నుంచి జార్ఖండ్ ఆడబోయే చివరి రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికైనా అతడు బరోడా వదిలి జార్ఖండ్ తమ చివరి మ్యాచ్ ఆడే జంషెడ్‌పూర్ వస్తాడా లేదా అన్నది చూడాలి.
రంజీ ట్రోఫీ ఆడాల్సిందే
నేషనల్ జట్టులో చోటు కోల్పోయిన వాళ్లు, పూర్తి ఫిట్ గా ఉన్న వాళ్లు కనీసం మూడు, నాలుగు రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ఆడాల్సిందే అన్న కొత్త నిబంధన దిశగా బీసీసీఐ ఆలోచిస్తోంది. సౌతాఫ్రికా పర్యటనను నవంబర్ లో మధ్యలోనే వదిలేసి వచ్చిన ఇషాన్.. అప్పటి నుంచీ రంజీ ఆడే అవకాశం ఉన్నా ఆడటం లేదు. పైగా అప్పుడే ఐపీఎల్ పై దృష్టిసారిస్తూ బరోడా వెళ్లి తన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
దీంతో ఇలాంటి ప్లేయర్స్ పని పట్టాలంటే బీసీసీఐ కఠిన నిబంధనలను తీసుకురావాలని రాష్ట్రాల అసోసియేషన్లు కోరుతున్నాయి. చాలా మంది యువ ప్లేయర్స్ ఐపీఎల్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆడి, తర్వాత రంజీ ట్రోఫీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ప్లేయర్స్ కు చెక్ పెట్టాలంటే కనీసం వేలంలో పాల్గొనాలన్నా రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనన్న నిబంధన తప్పనిసరి అన్నది అసోసియేషన్ల వాదన.
టీమిండియా ప్లేయర్స్‌పై పనిభారం
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఈ మెగా లీగ్ లో టీమిండియా ప్లేయర్స్ పై పని భారానికి సంబంధించి బీసీసీఐ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పటి వరకూ ఫ్రాంఛైజీలకు అలాంటి సూచనలు ఏవీ వెల్లలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ తేదీలు ఇంకా ఫైనల్ కాకపోయినా మార్చి 22 నుంచి మే 26 వరకూ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ లెక్కన ఐపీఎల్ ముగిసిన ఐదు రోజులకే టీ20 వరల్డ్ కప్ ఉంటుంది. దీంతో కొందరు కీలకమైన ప్లేయర్స్ పై పని భారాన్ని తగ్గించాలని బోర్డు భావించడం సహజం. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని తెలుస్తోంది. అలా చేస్తే వాళ్లకు భారీ చెల్లించే ఫ్రాంఛైజీలకు కూడా అన్యాయం చేసినట్లు అవుతుందని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.