IPL 2024 Comeback Players: పంత్ నుంచి స్టార్క్ వరకు.. ఐపీఎల్ 2024లో కమ్‍బ్యాక్ ఇస్తున్న ఏడుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే
15 March 2024, 16:30 IST
- IPL 2024 5 Comeback Players: ఐపీఎల్ 2024లో కొందరు ప్లేయర్లు తిరిగి రానున్నారు. వివిధ కారణాలతో గత సీజన్‍కు దూరమైన కొందరు ఆటగాళ్లు ఈ ఏడాది కమ్‍బ్యాక్ ఇవ్వనున్నారు. వారిపై అందరి దృష్టి ఉండనుంది.
IPL 2024 Comeback Players: పంత్ నుంచి స్టార్క్ వరకు.. ఐపీఎల్ 2024లో కమ్‍బ్యాక్ ఇస్తున్న ఏడుగురు స్టార్ ప్లేయర్లు వీళ్లే
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ మరో వారంలో మొదలుకానుంది. ఈ ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు ట్రైనింగ్ క్యాంప్‍లను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది సీజన్‍తో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‍లో కమ్‍బ్యాక్ చేస్తున్నారు. గతేడాది సీజన్ ఆడని కొందరు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‍లో రిటర్న్ అవుతున్నారు. అలా.. ఈ ఏడాది ఐపీఎల్ 2024లో కమ్‍బ్యాక్ ఇస్తున్న ఏడుగురు స్టార్ ఆటగాళ్ల వివరాలు ఇవే.
రిషబ్ పంత్
2022 డిసెంబర్‌లో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అప్పటి నుంచి జట్టుకు దూరమయ్యాడు. గతేడాది ఐపీఎల్ 2023 టోర్నీ కూడా ఆడలేదు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్. అయితే, తీవ్రంగా శ్రమించి ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు రిషబ్ పంత్‍కు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులోకి అడుగుపెట్టిన పంత్.. తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడి రాకతో ఢిల్లీ జట్టు మళ్లీ బలం పుంజుకుంది. గతేడాది పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేలవంగా ఆడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి ఆడనుండటంతో ఐపీఎల్ 2024లో అందరి కళ్లు పంత్‍పైనే ఉండనున్నాయి.
ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2023కు డుమ్మాకొట్టాడు. కోల్‍కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాల్సిన కమిన్స్ గతేడాది ఆడలేదు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్ కోసం వేలంలో కమిన్స్‌ను సన్‍రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20 కోట్లకు సొంతం చేసుకుంది. అతడిని ఈ సీజన్‍లో కెప్టెన్‍ను కూడా చేసింది. ఆస్ట్రేలియాకు గతేడాది డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ టైటిళ్లను కెప్టెన్‍గా అందించాడు కమిన్స్. దీంతో తమ జట్టుకు కూడా అతడిని సారథిని చేసింది హైదరాబాద్.
జస్‍ప్రీత్ బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటేందుకు ఐపీఎల్‍లో కమ్‍బ్యాక్ ఇస్తున్నాడు బుమ్రా. ఇటీవల టీమిండియా తరఫున అదరగొట్టిన బుమ్రా.. ఐపీఎల్‍లోనూ దుమ్మురేపుతాడని ముంబై ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్
వెన్ను గాయం కారణంగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గతేడాది ఐపీఎల్ సీజన్‍కు దూరమయ్యాడు. దీంతో కోల్‍కతా నైట్ రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనున్నాడు అయ్యర్. ఇటీవల రంజీ ట్రోఫీ ఫైనల్‍లో వెన్ను నొప్పి కారణంగా చివరి రెండు రోజులు మైదానంలోకి రాలేదు. అయితే, అతడు ఫిట్ అవుతాడని, ఐపీఎల్ 2024 పూర్తిగా ఆడతాడని తెలుస్తోంది. ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోనూ అయ్యర్ చోటు గల్లతైంది. ఈ తరుణంలో ఐపీఎల్ 2024లో సత్తాచాటాలని శ్రేయస్ అయ్యర్ వేచిచూస్తున్నాడు.
మిచెల్ స్టార్క్
సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‍లో అడుగుపెట్టనున్నాడు. 2024 సీజన్ కోసం వేలంలో కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. చివరగా 2015లో ఐపీఎల్‍లో స్టార్క్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. అందులోనే ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా ఉండటంతో స్టార్క్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
కేన్ విలియమ్సన్
గతేడాది ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్‍లోనే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమన్స్ గాయపడ్డాడు. దీంతో ఆ సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరమయ్యాడు. ఈ సీజన్‍లో మళ్లీ బరిలోకి దిగనున్నాడు కేన్. ఇటీవల టెస్టు క్రికెట్‍లో భీకర ఫామ్‍లో ఉన్న విలియమ్సన్.. ఐపీఎల్ 2024లో ఎలా ఆడతాడా అని చాలా మంది వేచిచూస్తున్నారు.
జానీ బెయిర్‌స్టో
కాలి గాయంగా కారణంగా గతేడాది ఐపీఎల్‍లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఆడలేదు. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజన్‍లో అతడు కమ్‍బ్యాక్ ఇవ్వనున్నాడు. బెయిర్‌స్టో రాకతో పంజాబ్ మరింత బలోపేతం కానుంది.