IPL 2024 Playoffs scenarios: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరు? ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? ఇక్కడ చూడండి
29 April 2024, 15:45 IST
- IPL Playoff scenarios: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే 46 మ్యాచ్ లు పూర్తవగా మరో 24 లీగ్ మ్యాచ్ లు ఉన్నాయి. మరి ఏ టీమ్ ప్లేఆఫ్స్ చేరనుంది? ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా అనే వివరాలు ఇక్కడ చూడండి.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరు? ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? ఇక్కడ చూడండి
IPL Playoff scenarios: ఐపీఎల్ 2024లో ఇప్పటికే అన్ని టీమ్స్ కనీసం 8, గరిష్ఠంగా 10 మ్యాచ్ లు ఆడేశాయి. ఢిల్లీ, గుజరాత్, బెంగళూరులాంటి టీమ్స్ కు మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా ఇప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తులపై స్పష్టత రాలేదు. సీఎస్కే, సన్ రైజర్స్ వరుసగా రెండేసి మ్యాచ్ లలో ఓటమితో రేసు రసవత్తరంగా మారింది.
రాజస్థాన్ రాయల్స్ ఒక్క అడుగు దూరంలో..
ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ లలో 18 పాయింట్లతో టాప్ లో ఉంది. ఆ టీమ్ ఒక్క విజయం సాధించినా ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం అవుతుంది. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఉంది. రాజస్థాన్ తర్వాత ఐదు టీమ్స్ పదేసి పాయింట్లతోనే రెండు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్నాయి. మరొక టీమ్ 8 పాయింట్లతో, మూడు టీమ్స్ ఆరు పాయింట్లతో ఉన్నాయి.
రాజస్థాన్ 8 గెలిచినా బెర్త్ కన్ఫమ్ కాకపోవడానికి ఓ కారణం ఉంది. చివర్లో ఉన్న ఆర్సీబీ తప్ప మిగిలిన అన్ని టీమ్స్ కు ఇంకా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. తర్వాత 10 పాయింట్లు ఉన్న ఐదు జట్లలో కోల్‌కతా మంచి పొజిషన్ లో ఉంది. ఆ టీమ్ 8 మ్యాచ్ లే ఆడి ఐదు గెలిచింది. మరో ఆరు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అందులో సగం గెలిచినా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది.
ఇక వరుసగా రెండు ఓటముల తర్వాత సన్ రైజర్స్ పై భారీ విజయంతో 10 పాయింట్ల మార్క్ చేరుకోవడంతోపాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 9 మ్యాచ్ లలో 10 పాయింట్లతో ఉంది. ఆ టీమ్ ఇంకా ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నా.. వరుసగా రెండు ఓటములతో ప్లేఆఫ్స్ బెర్తును క్లిష్టం చేసుకుంది.
ఐదు తర్వాత వాళ్లు డేంజర్ జోన్‌లోనే..
ఇక లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పదేసి పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. వీటిలో లక్నో 9 మ్యాచ్ లే ఆడగా.. ఢిల్లీ పది మ్యాచ్ లు ఆడేసింది. దీంతో ఢిల్లీ ఇక మిగిలి నాలుగు మ్యాచ్ లలో ఒక్కటీ ఓడిపోకుండా చూసుకోవాలి. అయితే ఈ నాలుగు మ్యాచ్ లలో మూడు తన కంటే పైన ఉన్న జట్లతోనే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి సోమవారం (ఏప్రిల్ 29) కేకేఆర్ తో ఉంది.
లక్నో, ఢిల్లీ వదిలేస్తే ఆ కింది టీమ్స్ అన్నీ ఇప్పటికే డేంజర్ జోన్లో ఉన్నట్లే. గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తమ మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ భారీ విజయాలు సాధించడంతోపాటు ఇతర జట్ల విషయంలోనూ తమకు కొన్ని అనుకూల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. ఆర్సీబీ రెండు వరుస విజయాలు సాధించినా ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
ఆ టీమ్ మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలిచినా.. గరిష్ఠంగా 14 పాయింట్ల దగ్గరే ఆగిపోతుంది. దీంతో ఏవైనా అద్బుతాలు జరిగితే తప్ప ఆర్సీబీ లీగ్ స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
టాపిక్