LSG vs RR: రాజస్థాన్ రయ్‍రయ్.. లక్నోపై రాయల్స్ అలవోక విజయం.. శాంసన్, జురెల్ సూపర్ హాఫ్ సెంచరీలు
LSG vs RR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి అదరగొట్టింది. కెప్టెన్ సంజూ శాంసన్, ధృవ్ జురెల్ అజేయ అర్ధ శతకాలతో దుమ్మురేపడంతో లక్నోపై లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది
LSG vs RR: ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఆట తీరుతో విజయాల మోత మెగిస్తోంది. దీంతో దాదాపు అప్పుడే ప్లేఆఫ్స్‌కు అర్హతకు అత్యంత సమీపించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్‍లో రాజస్థాన్ విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‍లో 7 వికెట్ల తేడాతో సంజూ శాంసన్ సారథ్యంలోని రాయల్స్ గెలిచింది. దీంతో ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 8 గెలిచింది రాజస్థాన్. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవడం దాదాపు ఖాయమైంది. అలాగే, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పదిలం చేసుకుంది.
శాంసన్, జురెల్ అదుర్స్
197 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించింది. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 బంతులను మిగిల్చి విజయం సాధించింది. 19 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 33 బంతుల్లోనే 71 పరుగులు చేసి అజేయంగా సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. 7 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టాడు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. యంగ్ స్టార్ ధృవ్ జురెల్ 34 బంతుల్లోనే 52 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. అతడు కూడా అజేయంగా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (34) ఉన్నంతసేపు వేగంగా ఆడారు. రియాన్ పరాగ్ (14) త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత శాంసన్, ధృవ్ జురెల్ మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. ముఖ్యంగా శాంసన్ సునాయాసంగా భారీ షాట్లు ఆడి దుమ్మురేపాడు. జురెల్ కూడా వేగంగా ఆడారు. వారిద్దరూ అజేయంగా నాలుగో వికెట్‍కు 121 పరుగులు జోడించి.. రాజస్థాన్‍ను గెలిపించారు.
లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు. అయితే, ఫీల్డింగ్ చాలా తప్పిదాలు చేసింది లక్నో. కొన్ని క్యాచ్‍లు నేలపాలు చేశారు లక్నో ఫీల్డర్లు.
రాహుల్, హుడా అర్ధ శతకాలు
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లోనే 76 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో హాఫ్ సెంచరీ చేశాడు. దీపక్ హుడా 31 బంతుల్లోనే 50 పరుగులతో అర్ధ శకతం సాధించాడు. క్వింటన్ డికాక్ (8), మార్కస్ స్టొయినిస్ (0) విఫలమయ్యాక లక్నో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్, హుడా అదరగొట్టారు. 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వారిద్దరూ ఔయ్యాక బదోనీ (18 నాటౌట్), కృణాల్ పాండ్యా (15 నాటౌట్) నిలిచినా వేగంగా ఆడలేకపోయారు. పూరన్ (11) త్వరగా ఔటయ్యాడు.
రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అగ్రస్థానంలో రాజస్థాన్
ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో 8సార్లు గెలిచింది రాజస్థాన్ రాయల్స్. 16 పాయింట్లను దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‍లో కంటిన్యూ అవుతోంది. అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. 9 మ్యాచ్‍ల్లో 5 ఓడి, నాలుగు గెలిచింది లక్నో. ప్రస్తుతం నాలుగో ప్లేస్‍లో కొనసాగింది.