IPL 2024 GT vs CSK: సెంచరీల మోత మోగించిన గిల్, సాయి సుదర్శన్.. చెన్నై బౌలర్లను చితక బాదిన గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు
10 May 2024, 21:21 IST
- IPL 2024 GT vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీల మోత మోగించారు. దీంతో ఆ టీమ్ భారీ స్కోరు చేసింది.
సెంచరీల మోత మోగించిన గిల్, సాయి సుదర్శన్.. చెన్నై బౌలర్లను చితక బాదిన గుజరాత్ టైటన్స్ ఓపెనర్లు
IPL 2024 GT vs CSK: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వీర బాదుడుతో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో పరుగుల వర్షంలో తడిసి ముద్దయింది. ఈ ఇద్దరూ సెంచరీల మోత మోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 రన్స్ చేసింది.
గిల్ ఐపీఎల్లో నాలుగో సెంచరీ, సాయి సుదర్శన్ తన తొలి సెంచరీ చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 210 పరుగులు జోడించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్ కు ఇదే జాయింట్ హయ్యెస్ట్ తొలి వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం.
గిల్, సుదర్శన్ బాదుడే బాదుడు
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పో కాసేపటికే ఆ జట్టుకు అర్థమైపోయింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఆకాశామే హద్దుగా చెలరేగారు. తొలి ఓవర్లోనే 14 పరుగులతో బోణీ చేసిన ఈ ఇద్దరూ తర్వాత ప్రతి ఓవర్లో సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. మొదట్లో నెమ్మదిగా కనిపించిన సుదర్శన్.. తర్వాత చెన్నై బౌలర్లతో ఆడుకున్నాడు.
అతడు 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అతన్ని చూసి మరింత చెలరేగాడు శుభ్‌మన్ గిల్. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి ధాటికి చెన్నై బౌలర్లను మారుస్తూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. వీళ్లు ముఖ్యంగా డారిల్ మిచెల్, సిమర్జీత్ సింగ్, జడేజా బౌలింగ్ ను లక్ష్యంగా చేసుకొని భారీగా పరుగులు పిండుకున్నారు.
50 బంతుల్లోనే సెంచరీలు
ఈ క్రమంలో మొదట గిల్, తర్వాత సాయి సుదర్శన్ సెంచరీల మోత మోగించారు. విచిత్రంగా ఇద్దరూ 50 బంతుల్లోనే తమ సెంచరీలు పూర్తి చేయడం విశేషం. సాయి సుదర్శన్ కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ కాగా.. గిల్ కు ఇది నాలుగో సెంచరీ. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో ఇదే చెన్నైపై సుదర్శన్ 96 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే సెంచరీ చేసిన వెంటనే సుదర్శన్ ఔటయ్యాడు. అతడు 51 బంతుల్లో 7 సిక్స్ లు, 5 ఫోర్లతో 103 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతనికి ఇదే తొలి సెంచరీ. దీంతో 210 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది.
సాయి సుదర్శన్ ఔటైన కాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ చేరాడు. అతడు 55 బంతుల్లో 105 రన్స్ చేశాడు. గిల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 6 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఇద్దరి వికెట్లనూ తుషార్ దేశ్‌పాండేనే తీసుకోవడం విశేషం. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశాడు.
గిల్, సుదర్శన్ ఔటైన తర్వాత గుజరాత్ తడబడింది. ఆ టీమ్ చివరి మూడు ఓవర్లలో కేవలం 22 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మరింత భారీ స్కోరు చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది.
టాపిక్