T20 World Cup Squad: ఐపీఎల్లోనే బెస్ట్ స్ట్రైక్ రేట్.. అయినా ఆ ముగ్గురినీ పక్కన పెట్టేశారు
T20 World Cup Squad: ఐపీఎల్ 2024లో బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న పలువురు ఇండియన్ ప్లేయర్స్ ను సెలెక్టర్లు అసలు పట్టించుకోలేదు. టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు కోసం కనీసం వాళ్ల పేర్లను కూడా పరిశీలించలేదు.
T20 World Cup Squad: స్ట్రైక్ రేట్.. ఇప్పుడు టీ20 క్రికెట్ లో చర్చంతా దీని చుట్టూనే తిరుగుతోంది. విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్ విషయంలో కొన్నాళ్లుగా ఈ చర్చ జరుగుతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు కోసం మాత్రం మన సెలెక్టర్లు అసలు ఈ స్ట్రైక్ రేట్ ను పట్టించుకోలేదు. ఐపీఎల్ 2024లో బెస్ట్ స్ట్రైక్ రేట్స్ ఉన్న టాప్ ఇండియన్ బ్యాటర్లలో నలుగురిని పక్కన పెట్టేశారు.
స్ట్రైక్ రేట్ పట్టించుకోరా?
టీ20 క్రికెట్ లో స్ట్రైక్ రేట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ధనాధన్ బాదుడే మ్యాచ్ లను గెలిపిస్తుంది. ఈ ఐపీఎల్లో అలాంటి బాదుడు బాదే ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. అందులో పలువురు యువ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. కనీసం 200కుపైగా రన్స్ చేసిన వాళ్లలో బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న టాప్ ఇండియన్ బ్యాటర్లలో ఒక్క శివమ్ దూబెకు మాత్రమే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.
ఈ లిస్టులో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ లో ఉన్నాడు. అతడు 10 మ్యాచ్ లలో ఏకంగా 208.6 స్ట్రైక్ రేట్ తో 315 రన్స్ చేశాడు. ఇక ఆర్సీబీకి చెందిన దినేష్ కార్తీక్ 195.52 స్ట్రైక్ రేట్ తో, రజత్ పటీదార్ 175.83 స్ట్రైక్ రేట్ తో రన్స్ చేశాడు. నాలుగో స్థానంలో ఉన్న శివమ్ దూబెకు 171.56 స్ట్రైక్ రేట్ ఉండగా.. ఐదో స్థానంలోని శశాంక్ సింగ్ స్ట్రైక్ రేట్ 169.41గా ఉంది.
కార్తీక్ ను పక్కన పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అభిషేక్ శర్మ, రజత్ పటీదార్, శశాంక్ సింగ్ ల పేర్లను సెలక్టర్లు అసలు పరిశీలించలేదు. ఇక సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 500కుపైగా పరుగులను 147.49 స్ట్రైక్ రేట్ తో చేశాడు. అతన్నీ పట్టించుకోలేదు. స్ట్రైక్ రేట్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన ఆ అంశాన్నే సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించేదే.
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన వాళ్ల స్ట్రైక్ రేట్స్ ఇవే
టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్స్ ను వాళ్ల స్ట్రైక్ రేట్ తో సంబంధం లేకుండానే ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. ఒక్క సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ మాత్రమే 170.87గా ఉంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 158.29తో రన్స్ చేశాడు. మిగిలిన వాళ్ల స్ట్రైక్ రేట్స్ చూస్తే సంజూ శాంసన్ (159.09), రిషబ్ పంత్ (158.56), యశస్వి జైస్వాల్ (157.21), హార్దిక్ పాండ్యా (150.38), విరాట్ కోహ్లి (147.49).. ఇలా అందరూ శశాంక్ సింగ్ కంటే తక్కువగానే ఉన్నారు.
భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్ 2024లో ఇలా భారీ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్సే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటి వాళ్ల పేర్లను కనీసం సెలెక్టర్లు పరిశీలించనే లేదు. ఐపీఎల్ కంటే ముందే వరల్డ్ కప్ కోర్ గ్రూప్ రెడీ అయిపోయిందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడం చూస్తుంటే.. చాలా వరకూ సీనియారిటీకి మాత్రమే ఓటేసినట్లు స్పష్టమవుతోంది.