Most Runs in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే.. కోహ్లియే టాప్
Most Runs in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లియే టాప్ లో ఉన్నాడు. టాప్ 5 బ్యాటర్లలో రోహిత్ శర్మ కూడా ఉండటం విశేషం.
Most Runs in T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ఇప్పటి వరకూ 8సార్లు జరిగిన ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో తెలుసా? అందరూ ఊహించినట్లే విరాట్ కోహ్లియే ఈ లిస్టులో టాప్ లో ఉండటం విశేషం. మరి టాప్ 5లో ఉన్న మిగతా బ్యాటర్లు ఎవరు? ఇక టీమ్స్ సాధించిన అత్యధిక స్కోర్లు ఏవి అన్నది ఇక్కడ చూడండి.
టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్లు
టీ20 వరల్డ్ కప్ తొలిసారి 2007లో జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2009, 2010, 2012, 2016, 2018, 2021, 2022లలో ఈ మెగా టోర్నీ జరిగింది. మరి ఇప్పటి వరకూ 8 సార్లు జరిగిన ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో తెలుసా? ఈ లిస్టులో విరాట్ కోహ్లి టాప్ లో ఉన్నాడు. కింగ్ కోహ్లి 27 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 81.5 సగటుతో 1141 రన్స్ చేశాడు.
అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధిక స్కోరు 89 పరుగులు కాగా.. స్ట్రైక్ రేట్ 131.3గా ఉంది. ఇక రెండో స్థానంలో శ్రీలంక లెజెండరీ క్రికెటర్ మహేల జయవర్దనె ఉన్నాడు. అతడు 31 మ్యాచ్ లలో 1016 రన్స్ చేశాడు. అతడు ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు చేయగా.. అత్యధిక స్కోరు 100గా ఉంది. సగటు 39.07 కాగా.. స్ట్రైక్ రేట్ 134.74గా ఉంది.
టీ20 వరల్డ్ కప్ లలో వెయ్యికి పరుగులు చేసిన బ్యాటర్లు ఈ ఇద్దరే కావడం విశేషం. మూడో స్థానంలో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతడు 33 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 965 రన్స్ చేశాడు. అందులో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 34.46 కాగా.. స్ట్రైక్ రేట్ 142.75గా ఉంది. నాలుగో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు.
2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడిన రోహిత్ ఇప్పటి వరకూ 39 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 963 రన్స్ చేశాడు. సగటు 34.39 కాగా.. స్ట్రైక్ రేట్ 127.88గా ఉంది. అందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐదో స్థానంలో మరో శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నె దిల్షాన్ ఉన్నాడు. అతడు 35 మ్యాచ్ లలో 897 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 96 పరుగులు. ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌లలో అత్యధిక టీమ్ టోటల్స్
టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు శ్రీలంక పేరిట ఉంది. ఆ టీమ్ 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లో కెన్యాపై 6 వికెట్లకు 260 రన్స్ చేసింది. ఇక ఇండియాకు టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక స్కోరు 218 పరుగులు. అది కూడా 2007లో జరిగిన తొలి టోర్నీలోనే కావడం విశేషం. ఇంగ్లండ్ పై ఈ స్కోరు సాధించగా.. ఆ మ్యాచ్ లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లతోపాటు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
అత్యధిక స్కోర్ల జాబితాలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో ఇంగ్లండ్ (230/8), సౌతాఫ్రికా (229/4) ఉన్నాయి. ఈ రెండు స్కోర్లు 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో నమోదయ్యాయి.