IPL 2024 Full Schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే.. మే 26నే ఫైనల్
25 March 2024, 15:43 IST
- IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీసీఐ. సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదట కేవలం 21 మ్యాచ్ ల షెడ్యూలే రిలీజ్ చేసిన బోర్డు.. ఇప్పుడు మొత్తం 74 మ్యాచ్ ల వివరాలను వెల్లడించింది.
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే.. మే 26నే ఫైనల్
IPL 2024 Full Schedule: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మొత్తం 74 మ్యాచ్ ల షెడ్యూల్ ను బీసీసీఐ సిద్ధం చేసినట్లు క్రిక్‌బజ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా.. అన్ని మ్యాచ్ లూ ఇండియాలోనే జరగనున్నాయి. రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో, ఒక ప్లేఆఫ్ తోపాటు ఫైనల్ చెన్నైలో జరగనున్నాయి.
ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకపోవడంతో మొదట్లో ఐపీఎల్ 2024లో మొదటి 21 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి. ఇక తాజాగా మిగతా షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఏప్రిల్ 5 తర్వాత రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఉండనుంది.
ఏప్రిల్ 8న 22వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఎన్నికల కోసం మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మొదట భావించినా.. అలాంటిదేమీ లేదని తాజా షెడ్యూల్ తో స్పష్టమైంది. ఇక తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు మే 21, 22వ తేదీల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి.
క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లో మే 24, మే 26వ తేదీల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతాయి. నిజానికి ఐపీఎల్ 2024లో రెండో విడత మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహిస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ తర్వాత బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ రిలీజై చాలా రోజులు అవుతున్నా.. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమయంలో ఐపీఎల్ జరగనుండటంతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే గతంలో 2009, 2014 లలో ఐపీఎల్ మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం మొత్తం 74 మ్యాచ్ లు ఇండియాలోనే జరగనున్నాయి.
13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు
మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్ లు మే 19 వరకు కొనసాగనున్నాయి. ఒక రోజు బ్రేక్ తర్వాత మే 21 నుంచి ప్లేఆఫ్స్ మొదలవుతాయి. ఈసారి మొత్తం 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. పది ఫ్రాంఛైజీల హోమ్ గ్రౌండ్స్ తోపాటు వైజాగ్ (ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల (పంజాబ్ కింగ్స్), గువాహతి (రాజస్థాన్ రాయల్స్)లలోనూ మ్యాచ్ లు ఉంటాయి.
ఐపీఎల్ 2024లో ఇప్పటికే తొలి రౌండ్ మ్యాచ్ లు పూర్తయిన విషయం తెలిసిందే. అన్ని టీమ్స్ ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉంది.
టాపిక్