SRS in IPL 2024: డీఆర్ఎస్ కాదు ఎస్ఆర్ఎస్.. ఐపీఎల్లో బీసీసీఐ సరికొత్త ప్రయోగం.. అసలేంటిది?-bcci introducing smart replay system srs in ipl 2024 instead of decision review system drs what is srs ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srs In Ipl 2024: డీఆర్ఎస్ కాదు ఎస్ఆర్ఎస్.. ఐపీఎల్లో బీసీసీఐ సరికొత్త ప్రయోగం.. అసలేంటిది?

SRS in IPL 2024: డీఆర్ఎస్ కాదు ఎస్ఆర్ఎస్.. ఐపీఎల్లో బీసీసీఐ సరికొత్త ప్రయోగం.. అసలేంటిది?

Hari Prasad S HT Telugu
Mar 20, 2024 10:40 AM IST

SRS in IPL 2024: ఐపీఎల్లో మరో ప్రయోగం చేయబోతోంది బీసీసీఐ. డీఆర్ఎస్ కు బదులు ఎస్ఆర్ఎస్ అనే మరో కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. అసలు ఈ కొత్త రివ్యూ సిస్టమ్ ఏంటో తెలుసుకోండి.

డీఆర్ఎస్ కాదు ఎస్ఆర్ఎస్.. ఐపీఎల్లో బీసీసీఐ సరికొత్త ప్రయోగం
డీఆర్ఎస్ కాదు ఎస్ఆర్ఎస్.. ఐపీఎల్లో బీసీసీఐ సరికొత్త ప్రయోగం

SRS in IPL 2024: క్రికెట్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని ఓ ప్లేయర్ సమీక్షించే విధానానికి డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అనే పేరు ఉంది. కానీ ఇప్పుడు ఐపీఎల్లో బీసీసీఐ మాత్రం ఈ డీఆర్ఎస్ ను కాదని కొత్త ఎస్ఆర్ఎస్(SRS) ను తీసుకొస్తోంది. ఎస్ఆర్ఎస్ అంటే స్మార్ట్ రీప్లే సిస్టమ్. అసలు ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుందన్నది మీరూ చూడండి.

ఐపీఎల్లో ఎస్ఆర్ఎస్

ఆన్ ఫీల్డ్ అంపైర్ ను సవాలు చేసే ప్లేయర్ కు ఇక నుంచి ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్(SRS) ద్వారా మూడో అంపైర్ నిర్ణయం వెల్లడిస్తాడు. ఇది మరింత వేగంగా, కచ్చితత్వంతో ఉండనుంది. ఈ ఎస్ఆర్ఎస్ ద్వారా టీవీ అంపైర్ ఇక నుంచి హాక్-ఐ సిస్ట్ నుంచే ఇద్దరు ఆపరేటర్ల ద్వారా నేరుగా ఇన్‌పుట్స్ అందుకుంటారు. గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 8 హైస్పీడ్ కెమెరాల నుంచి ఈ ఇమేజెస్ వస్తాయని ఈఎస్పీఎన్ క్రికిన్ఫో తన రిపోర్టులో వెల్లడించింది.

ఈ కొత్త పద్ధతిలో టీవీ బ్రాడ్‌కాస్ట్ ఆపరేటర్ తో మూడో అంపైర్ కు పని ఉండదు. నేరుగా హాక్-ఐ సిస్టమ్ ఆపరేటర్లే అత్యాధునిక కెమెరాల ద్వారా తీసిన ఫీడ్ అందిస్తారు. దీంతో మూడో అంపైర్ మరింత వేగంగా, తప్పిదాలకు అవకాశం లేకుండా నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ విజువల్స్ ను విశ్లేశించి నిర్ణయం తీసుకునే వీలు అంపైర్లకు కలుగుతుంది.

హాక్-ఐ ఆపరేటర్లతో మూడో అంపైర్ జరిపే సంభాషణను కూడా లైవ్ లో చూపిస్తారు. దీనివల్ల ఈ ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా ఉంటుంది. వివిధ కోణాల నుంచి స్పష్టమైన విజువల్స్ అందడం ద్వారా మూడో అంపైర్ తన నిర్ణయాన్ని సులువుగా తీసుకోవచ్చు. బౌండరీల దగ్గర క్యాచ్ లు, ఎల్బీడబ్ల్యూ, స్టంపింగ్ లాంటివాటిపై నిర్ణయాలు తీసుకోవడం మరింత సులువు అవుతాయి.

ఆ వివాదమే కారణమా?

ఈ మధ్యే ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో డీఆర్ఎస్ నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ ప్లేయర్స్, మాజీలు తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు ఐపీఎల్లో ప్రయోగాత్మకంగా ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ ను తీసుకొస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కొత్త సిస్టమ్ పై ఈ మధ్యే బీసీసీఐ రెండు రోజుల పాటు వర్క్ షాప్ కూడా నిర్వహించింది. ఈ SRS ఎలా పని చేస్తుందో వాళ్లకు వివరించారు. నిజానికి ఇలాంటి పద్దతినే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ది హండ్రెడ్ టోర్నీలో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూసింది.

ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో లేని కొత్త కొత్త వాటిని అమలు చేయడం నిర్వాహకులకు అలవాటుగా మారింది. స్ట్రేటజిక్ టైమౌట్, ఇంపాక్ట్ ప్లేయర్ లాంటి నిబంధనలు ఐపీఎల్లో మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ 2024లో ఈ ఎస్ఆర్ఎస్ కూడా రాబోతోంది.

Whats_app_banner