IPL 2024 Schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ అధికారికంగా వెల్లడి.. 12ఏళ్ల తర్వాత చెన్నైలో ఫైనల్
25 March 2024, 18:54 IST
- IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 సీజన్ రెండో దశ షెడ్యూల్ కూడా వచ్చేసింది. అన్ని మ్యాచ్‍ల తేదీలు ఖరారయ్యాయి. 12 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‍కు ఆతిథ్యమివ్వనుంది చెన్నై. ఆ వివరాలివే..
IPL 2024 2nd Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ అధికారికంగా వెల్లడి.. 12ఏళ్ల తర్వాత చెన్నైలో ఫైనల్
IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ నిర్వహణపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సీజన్‍కు సంబంధించిన పూర్తి రెండో దశ షెడ్యూల్‍ను నేడు (మార్చి 25) బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది లోక్‍సభ ఎన్నికలు ఉండడంతో ముందుగా 21 మ్యాచ్‍లతో తొలి దశ షెడ్యూల్‍నే బీసీసీఐ వెల్లడించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వ వరకు 21 మ్యాచ్‍లనే ఖరారు చేసింది. అయితే, నేడు రెండో దశ షెడ్యూల్‍ను కూడా వెల్లడించింది. ఈ సీజన్‍లో జరగనున్న 74 మ్యాచ్‍ల పూర్తి షెడ్యూల్‍ను ఖరారు చేసింది. ఎన్నికలు ఉన్నా ఈ సీజన్ అంతా ఇండియాలోనే జరగనుంది. మే 26వ తేదీన ఐపీఎల్ 2024 ఫైనల్ జరగనుంది. వివరాలివే..
తొలి దశలో ఏప్రిల్ 7వ తేదీన వరకు జరగనున్న తొలి షెడ్యూల్‍ను బీసీసీఐ గతంలో వెల్లడించగా.. ఇప్పుడు రెండో షెడ్యూల్‍లో ఏప్రిల్ 8 నుంచి మే 26వ తేదీ వరకు మ్యాచ్‍లను కూడా ఖరారు చేసింది.
ప్లేఆఫ్స్, ఫైనల్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో మే 19వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‍లు ఉండనున్నాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్‌లో మే 21వ తేదీన అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్యాలిఫయర్ 1, మే 22వ తేదీన అక్కడే ఎలిమినేటర్ జరగనున్నాయి. మే 24వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-2 జరగనుంది. మే 26వ తేదీన చెన్నైలోని ఫైనల్ జరుగుతుందని బీసీసీఐ ఖరారు చేసింది.
12ఏళ్ల తర్వాత చెన్నైలో టైటిల్ ఫైట్
ఐపీఎల్‍లో ఫైనల్‍కు 12 ఏళ్ల తర్వాత చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్‍లో 2011, 2012 సీజన్లలో ఫైనల్ అక్కడే జరిగింది. ఆ తర్వాతి సీజన్లలో ఇతర సిటీల్లో జరుగుతూ వస్తోంది. అయితే, ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ డెన్‍లో ఐపీఎల్ 2024 టైటిల్ ఫైట్ జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి షెడ్యూల్‍తో తమ హోం గ్రౌండ్‍గా వైజాగ్‍ను ఎంపిక చేసుకుంది. అయితే, రెండో షెడ్యూల్‍లో మిగిలిన హోం మ్యాచ్‍లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఆడనుంది.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకాగా.. ఇప్పటికే అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. ఈ సీజన్‍లో లీగ్ మ్యాచ్‍లు మే 19వ తేదీ వరకు ప్రతీ రోజూ జరగనున్నాయి. ఆ తర్వాత ఒక్క రోజు విరామం తర్వాత మే 21 ప్లేఆఫ్స్ మొదలవుతాయి. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని పోలింగ్ తేదీల తేదీల ప్రకారం షెడ్యూల్‍ను బీసీసీఐ రూపొందించింది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ రెండో దశను బీసీసీఐ విదేశాల్లో నిర్వహిస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇండియాలో జరిపేందుకే కట్టుబడి ఉన్నామని బీసీసీఐ చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళిక రచించి ఐపీఎల్ 2024లో మొత్తం 74 మ్యాచ్‍లను భారత్‍లో నిర్వహించేందుకు నిర్ణయించింది.
ఎన్నికల కారణంగా 2009లో ఐపీఎల్ సీజన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్‍లు యూఏఈలో జరిగాయి. అయితే, 2019లో ఎన్నికలు ఉన్నా పూర్తిగా ఇండియాలోనే జరిగింది. ఇప్పుడు, 2024లోనూ ఎలక్షన్లు ఉన్నా పూర్తిగా ఐపీఎల్‍ను భారత్‍లోనే నిర్వహిస్తోంది బీసీసీఐ.