CSK captain Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్.. ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు పెద్ద షాక్
CSK captain Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ గట్టి షాకే ఇచ్చింది. ఈ సీజన్లో ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఆ ఫ్రాంచైజీ కెప్టెన్ గా ఎంపిక చేసింది.
CSK captain Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు కెప్టెన్సీ మార్పుతో పెద్ద షాకే ఇచ్చింది. రెండేళ్ల కిందటే ఇలాగే లీగ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు జడేజాను కెప్టెన్ ను చేశారు. ఇప్పుడు ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ అప్పగిస్తున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీయే గురువారం (మార్చి 21) మధ్యాహ్నం సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అనౌన్స్ చేసింది. "అధికారిక ప్రకటన: ఎమ్మెస్ ధోనీ తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. 52 మ్యాచ్ లు ఆడాడు. రాబోయే సీజన్ కోసం టీమ్ ఎదురు చూస్తోంది" అని సీఎస్కే అనౌన్స్ చేసింది. నిజానికి అంతకు ముందే చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2024 కెప్టెన్స్ డే ఫొటోషూట్ లో రుతురాజ్ ఉన్నాడు.
దీంతో చెన్నై టీమ్ కు కెప్టెన్ మారాడంటూ వెంటనే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాసేపటికే ఆ ఫ్రాంఛైజీ కూడా అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. తమ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ధోనీ స్థానంలో ఈ సీజన్ కు కెప్టెన్ గా ఉంటాడని స్పష్టం చేసింది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదోసారి ట్రోఫీ అందించిన ధోనీ.. ఈ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్
ధోనీ వయసు 42 ఏళ్లు. గత మూడు సీజన్లుగా ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం ప్రతి సీజన్లో చెన్నై చూస్తూనే ఉంది. 2022లోనే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ స్థానంలో రవీంద్ర జడేజా కెప్టెన్ అని ప్రకటించి ఆశ్చర్యపరిచింది.
అయితే ఆ సీజన్ లో సీఎస్కే వరుస పరాజయాలు చవిచూసింది. దీంతో సీజన్ మధ్యలోనే మరోసారి జడేజాను పక్కన పెట్టి ధోనీకి కెప్టెన్సీ అప్పగించారు. ఆ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లతోపాటు గతేడాది కూడా ధోనీయే కెప్టెన్ గా ఉన్నాడు. 2023లో ధోనీ కెప్టెన్సీలోనే ఫైనల్లో చివరి బంతికి ఫోర్ కొట్టి జడేజా చెన్నైని గెలిపించాడు. అప్పటి నుంచే మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ.. తర్వాత సర్జరీ చేయించుకున్నాడు.
దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కాబోతోందన్నది ఇప్పుడు కెప్టెన్సీ మార్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. అతడు జట్టులో ఉన్నప్పుడే మరొకరికి కెప్టెన్సీ అప్పగించడం ద్వారా యువ ఆటగాడు కెప్టెన్ గా రాటుదేలుతాడన్నది సీఎస్కే ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో ఇండియన్ టీమ్ కు కూడా రుతురాజ్ కెప్టెన్ గా ఉన్నాడు. గతేడాది ఏషియన్ గేమ్స్ లో కెప్టెన్ గా గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు.
జడేజా కెప్టెన్ గా విఫలమవడంతోపాటు కెప్టెన్సీ తీసుకోవడానికి నిరాకరించడంతోనే రుతురాజ్ చేతుల్లో కెప్టెన్సీ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త కెప్టెన్ సారథ్యంలో చెన్నై టీమ్ ఈ ఏడాది ఎలా ఆడుతుందో చూడాలి.