IPL 2024 Viewership: ఐపీఎల్లో అన్ని రికార్డులు బ్రేక్ చేసిన సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్.. ఎంత మంది చూశారో తెలుసా?
28 March 2024, 19:17 IST
- IPL 2024 Viewership: ఐపీఎల్ 2024 తొలి మ్యాచే అన్ని బ్రాడ్‌కాస్టింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. 17వ సీజన్ తొలి మ్యాచ్ లోనే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ను కోట్లాది మంది చూడటం విశేషం.
ఐపీఎల్లో అన్ని రికార్డులు బ్రేక్ చేసిన సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్.. ఎంత మంది చూశారో తెలుసా?
IPL 2024 Viewership: ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచే రికార్డులు బ్రేక్ చేసింది. ఈ మెగా లీగ్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి తేలిపోయింది. స్టార్ స్పోర్ట్స్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ను ఏకంగా 16.8 కోట్ల మంది చూడటం విశేషం. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వెల్లడించింది.
ఐపీఎల్ 2024 బ్రాడ్‌కాస్ట్
ఐపీఎల్ 2024 బ్రాడ్ కాస్టింగ్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దగ్గర ఉన్న విషయం తెలిసిందే. డిజిటల్ హక్కులు జియో సినిమా చేతికి చిక్కినా.. శాటిలైట్ రైట్స్ మాత్రం ఈ ఛానెల్ దగ్గరే ఉన్నాయి. జియో సినిమా ఈ లీగ్ మ్యాచ్ లను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తున్నా.. టీవీల్లో ఐపీఎల్ మ్యాచ్ లను చూసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ సీజన్ తొలి మ్యాచే రెండు టాప్ టీమ్స్ మధ్య జరిగింది.
దీంతో సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ ను అభిమానులు ఎగబడి చూశారు. మొత్తంగా 16.8 కోట్ల మంది యూనిక్ యూజర్లు ఈ మ్యాచ్ చూడగా.. 12276 కోట్ల వాచ్ టైమ్ నమోదు కావడం గమనార్హం. ఐపీఎల్ ఎప్పుడు జరిగినా.. ఫీల్డ్ లోనే కాదు.. బయట కూడా ఇలాంటి రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తొలి మ్యాచ్ ఒకే సమయంలో 6.1 కోట్ల వ్యూయర్షిప్ నమోదు చేయడం కూడా ఓ రికార్డే.
ఇది నిజంగా చిరకాలం గుర్తుండిపోయే రికార్డు అని స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ అధికార ప్రతినిధి అన్నారు. టీవీల్లో లైవ్ క్రికెట్ చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శమని అభిప్రాయపడ్డారు. అటు జియో సినిమా ఓటీటీలోనూ ఐపీఎల్ చూసే వారి సంఖ్య రోజుకో రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది.
ఐపీఎల్ 2024 రికార్డులు
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే విజయం సాధించింది. ఇక తాజాగా బుధవారం (మార్చి 27) సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.
ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు, మ్యాచ్ లో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్స్‌లు.. ఇలా హైదరాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికైంది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో 277 రన్స్ చేయగా.. చివరికి ముంబైపై 31 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ 20లోపు బంతుల్లోనే హాఫ్ సెంచరీలు చేశారు. ఇది కూడా ఐపీఎల్లో ఓ రికార్డే. మొత్తంగా ఈ మ్యాచ్ లో 523 పరుగులు నమోదయ్యాయి.
టాపిక్