IND vs NZ 3rd Test: వాంఖడే టెస్టుకి భారత్ తుది జట్టులో రెండు మార్పులు.. సిరాజ్, ధ్రువ్ జురెల్‌కి మళ్లీ పిలుపు?
29 October 2024, 7:30 IST
India Playing XI For 3rd Test: సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్ జట్టు.. ఇక నామమాత్రమైన ఆఖరి టెస్టుని వాంఖడేలో ఆడనుంది. దాంతో తొలి రెండు టెస్టులకి దూరంగా ఉన్న జురెల్, రెండో టెస్టులో వేటుకి గురైన సిరాజ్‌కి ఛాన్స్ ఇవ్వనుంది.
భారత్ టెస్టు జట్టు
న్యూజిలాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి సిరీస్‌ను కూడా చేజార్చుకున్న భారత్ జట్టు.. నవంబరు 1 నుంచి ప్రారంభంకానున్న ఆఖరి టెస్టులో రెండు మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో, పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో కివీస్ చేతిలో భారత్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ కూడా 0-2తో టీమిండియాకి చేజారింది.
ఆ ఇద్దరికీ రెస్ట్.. ఎందుకంటే?
భారత్ గడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ని టీమిండియా చేజార్చుకోగా.. నామమాత్రమైన ఆఖరి టెస్టు నుంచి ఇద్దరు ప్లేయర్లకి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో నవంబరు 22 నుంచి కీలకమైన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. కంగారూల గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుండగా.. ఆ సిరీస్‌లో కీలకం అవుతారని భావిస్తున్న ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌కి రెస్ట్ ఇవ్వబోతున్నారట.
గాయంతోనే ఆడుతున్న పంత్
వాస్తవానికి రిషబ్ పంత్.. ఇటీవల బెంగళూరు టెస్టులోనే గాయపడ్డాడు. జడేజా విసిరిన బంతి అతని మోకాలికి బలంగా తాకింది. ఆ ప్లేస్‌లోనే యాక్సిడెంట్ కారణంగా సర్జరీ కూడా జరిగి ఉండటంతో పంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఆ తర్వాత కీపింగ్‌కి దూరంగా ఉన్న పంత్ బ్యాటింగ్ మాత్రం చేశాడు.
కానీ.. నాలుగు రోజుల వ్యవధిలోనే ఫిట్‌నెస్ సాధించిన రిషబ్ పంత్ పుణె టెస్టులో ఆడాడు. కానీ.. ఆస్ట్రేలియా టూర్ ముంగిట అతని గాయంతో రిస్క్ చేయకూడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దాంతో వాంఖడే టెస్టు నుంచి పంత్‌కి రెస్ట్ ఇచ్చి గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకునేందుకు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి
జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవల బంగ్లాదేశ్‌తో వరుసగా రెండు టెస్టులు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల్లోనూ ఆడాడు. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మోకాలి గాయంతో చాలా రోజుల నుంచి భారత్ జట్టు దూరంగా ఉంటుండంతో మైదానంలో పనిభారం పెరిగింది. దాంతో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకి కూడా వాంఖడే టెస్టు నుంచి విశ్రాంతి ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇద్దరికీ పిలుపు
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ జట్టులోకి రానున్నారు. ఈ ఇద్దరూ మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
వాంఖడే టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్