India vs England: టీమిండియాకు వరుసగా 17వ సిరీస్ విజయం.. స్టోక్స్‌కు తొలి ఓటమి.. ఇంగ్లండ్ బజ్‌బాల్ దిమ్మదిరిగిపోయింది
26 February 2024, 15:20 IST
- India vs England: స్వదేశంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టీమిండియా వరుసగా 17వ టెస్ట్ సిరీస్ గెలిచింది. మరోవైపు ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. బెన్ స్టోక్స్ కెప్టెన్ గా తన తొలి సిరీస్ ఓటమి చవిచూశాడు.
టీమిండియాకు వరుసగా 17వ సిరీస్ విజయం.. స్టోక్స్‌కు తొలి ఓటమి
India vs England: ఇంగ్లండ్ బజ్‌బాల్ కు అసలు పరీక్ష ఇండియాలోనే.. ఇదీ గతేడాది నాసిర్ హుస్సేన్ లాంటి అక్కడి మాజీలు చెప్పిన మాట. వాళ్ల అంచనా నిజమే అయింది. ఇండియాలో ఇంగ్లండ్ బజ్‌బాల్ పని చేయలేదు. మరో టెస్ట్ మిగిలి ఉండగానే టీమిండియా 3-1తో సిరీస్ గెలిచింది. స్వదేశంలో 12 ఏళ్లుగా ఒక్క సిరీస్ కూడా ఓడని ఇండియన్ క్రికెట్ టీమ్.. వరుసగా 17వ టెస్ట్ సిరీస్ గెలవడం గమనార్హం.
టీమిండియా ఆధిపత్యం
ఏ క్రికెట్ జట్టుకైనా స్వదేశంలో ఆడుతుండటం ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తుంది. కానీ టీమిండియా స్వదేశంలో డామినేట్ చేసినట్లుగా ప్రపంచంలో ఏ ఇతర జట్టూ చేయదంటూ అతిశయోక్తి కాదు. తాజాగా ఇంగ్లండ్ పై మరోసారి అదే నిరూపించింది. స్టోక్స్ కెప్టెన్సీలో ఒక్క ఓటమి కూడా ఎరగని జట్టుగా ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు తొలి సిరీస్ ఓటమి రుచి చూపించింది.
అంతేకాదు స్వదేశంలో 2012లో చివరిసారి ఇదే ఇంగ్లండ్ చేతుల్లో టెస్ట్ సిరీస్ ఓడిన టీమిండియా.. మళ్లీ అలాంటి పరాభవం మూటగట్టుకోలేదు. అప్పటి నుంచి ఈ 12 ఏళ్లలో వరుసగా 17వ టెస్ట్ సిరీస్ గెలిచింది. అంతేకాదు ఈ పుష్కర కాలంలో ఇండియన్ టీమ్ కనీసం సిరీస్ ను డ్రా కూడా చేసుకోలేదంటే ఏ స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇంగ్లండ్ తో సిరీస్ లో హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులోనే ఓడినా.. తర్వాత వరుసగా విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ టెస్టుల్లో గెలిచి సిరీస్ ఎగరేసుకుపోయింది. అంతేకాదు మూడో టెస్టులో అయితే ఇంగ్లండ్ ను 434 పరుగులతో చిత్తు చేసి వాళ్ల బజ్‌బాల్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. తాజాగా రాంచీ టెస్టులోనూ ఓటమి కోరల్లో నుంచి బయటపడి విజయం సాధించింది.
బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు షాక్
బెన్ స్టోక్స్ ఏప్రిల్ 28, 2022లో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత మే 12, 2022లో బ్రెండన్ మెకల్లమ్ కోచ్ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేసిన ఇంగ్లండ్ టీమ్ వరుస విజయాలతో దూసుకెళ్లింది. క్రికెట్ ప్రపంచం దానికి బజ్‌బాల్ అనే పేరు పెట్టింది. కానీ ఆ బజ్‌బాల్ కు ఇండియాలో షాక్ తగిలింది.
కెప్టెన్ గా స్టోక్స్ తన తొలి టెస్ట్ సిరీస్ ఓడిపోయాడు. స్టోక్స్, మెకల్లమ్ కాంబినేషన్ లో ఇంగ్లండ్ ఈ రెండేళ్లలో మొత్తం 7 టెస్టు సిరీస్ లు ఆడింది. అందులో నాలుగు గెలవగా.. మరో మూడు డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇండియాలో తాము ఆడిన 8వ సిరీస్ లో తొలి ఓటమి ఎదురైంది. ఇండియాలోని స్పిన్ పిచ్ లపై కూడా బజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడటానికి ప్రయత్నించిన ఇంగ్లండ్ తగిన మూల్యం చెల్లించుకుంది.
ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్
2022లో స్టోక్స్, మెకల్లమ్ కెప్టెన్, కోచ్ కాంబినేషన్ లో ఇంగ్లండ్ జైత్రయాత్ర మొదలైంది. మొదట న్యూజిలాండ్ ను 3-0తో చిత్తు చేసింది ఇంగ్లండ్. ఆ సిరీస్ లోనే ధాటిగా ఆడుతూ బజ్‌బాల్ అనే ఓ కొత్త స్టైల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఇండియాతో ఐదు టెస్టుల సిరీస్ ను స్వదేశంలో 2-2తో డ్రాగా ముగించింది.
ఇక తమ దగ్గరికి వచ్చిన సౌతాఫ్రికా టీమ్ ను 2-1తో చిత్తు చేసింది. పాకిస్థాన్ వెళ్లి వాళ్ల దేశంలోనే 3-0తో ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లి అక్కడ 1-1తో సిరీస్ డ్రా చేసుకుంది. ఐర్లాండ్ లో 1-0తో గెలిచింది.
గతేడాది జరిగిన యాషెస్ సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుంది. మొత్తానికి ఇప్పుడు ఇండియాలో వాళ్ల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మరి ఇప్పుడైనా ఆ టీమ్ తమ బజ్‌బాల్ స్టైల్ పై రివ్యూ చేస్తుందా లేక అదే స్టైల్ కొనసాగిస్తుందా అన్నది చూడాలి.