India vs England Live Score: యశస్వి ఫిఫ్టీ.. గిల్ మళ్లీ ఫెయిల్.. లంచ్ సమయానికి టీమిండియా స్కోరు ఇదీ
02 February 2024, 11:53 IST
- India vs England Live Score: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు తొలి సెషన్ లో యశస్వి హాఫ్ సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్ మళ్లీ ఫెయిలయ్యాడు. లంచ్ సమయానికి ఇండియా 2 వికెట్లకు 103 రన్స్ చేసింది.
యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో టీమిండియా మంచి స్కోరు
India vs England Live Score: ఇంగ్లండ్ తో తొలి టెస్టులో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టును కూడా మరీ అంత కాన్ఫిడెంట్ గా ప్రారంభించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు లంచ్ సమయానికి 2 వికెట్లకు 103 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ (51 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (34) మళ్లీ విఫలమయ్యాడు.
ఇండియా, ఇంగ్లండ్ సమం
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే హోమ్ టీమ్ ను స్పిన్ తోనే దెబ్బకొట్టాలని డిసైడ్ అయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కు ముగ్గురు స్పిన్నర్లు, ఓ పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ తో బరిలోకి దిగింది. ఓవైపు ఆండర్సన్, మరోవైపు రూట్ తో బౌలింగ్ దాడిని ప్రారంభించింది.
17 ఓవర్ల వరకూ ఇండియన్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ వికెట్ పడకుండా చూసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ తోనే టెస్ట్ అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తొలి దెబ్బ కొట్టాడు. అతడు తన తొలి వికెట్ నే కెప్టెన్ రోహిత్ శర్మ (14) రూపంలో తీసుకోవడం విశేషం. బషీర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ ఆడబోయిన రోహిత్.. లెగ్ స్లిప్ లో పోప్ కు క్యాచ్ ఇచ్చాడు.
షోయబ్ బషీర్ తొలి వికెట్
దీంతో 40 రన్స్ దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఓవైపు యశస్వి జైస్వాల్ మాత్రం తనదైన రీతిలో కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అతనికి శుభ్‌మన్ గిల్ కూడా తోడయ్యాడు. ఈ ఇద్దరూ మొదట్లో మెల్లగా ఆడి తర్వాత జోరు పెంచారు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న గిల్.. క్రీజులో నిలదొక్కుకోవడానికి టైమ్ తీసుకున్నాడు.
తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే 34 పరుగుల దగ్గర ఆండర్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈసారి లభించిన మంచి ఆరంభాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో 89 రన్స్ దగ్గర ఇండియన్ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది.
యశస్వి మరో ఫిఫ్టీ
నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. లంచ్ కు ముందు అతనికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. అయ్యర్ 7 బంతుల్లో 4 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ మాత్రం టెస్టుల్లో తన మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 92 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ తో నాటౌట్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అతడు కాస్త ఓపికగా ఆడుతున్నాడు. అనవసర షాట్లకు పోవడం లేదు.
ఈ మ్యాచ్ కు ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. జడేజా, రాహుల్, సిరాజ్ స్థానాల్లో కుల్దీప్, రజత్ పటీదార్, ముకేశ్ కుమార్ వచ్చారు. అయితే సిరాజ్ స్థానంలో ముకేశ్ బదులు వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవాల్సిందని చాలా మంది క్రికెట్ పండితులు అభిప్రాయపడ్డారు.
టాపిక్