Yashasvi Jaiswal: తప్పు నాదే.. సారీ చెప్పా: యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: రుతురాజ్ గైక్వాడ్‍కు తాను క్షమాపణ చెప్పానని భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో రెండో టీ20 తర్వాత అతడు మాట్లాడాడు. ఆ వివరాలివే..
Yashasvi Jaiswal: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. ఆదివారం (నవంబర్ 26) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‍లోనూ రాణించింది. ఆసీస్‍ను కట్టడి చేసి 44 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. టీమిండియా సెన్సేనల్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‍లో 25 బంతుల్లోనే 53 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడాడు.
తొలి టీ20లో రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అవడం గురించి యశస్వి జైస్వాల్ గుర్తు చేసుకున్నాడు. ఆ రనౌట్ విషయంలో తప్పు తనదేనని, రుతురాజ్ గైక్వాడ్‍కు సారీ కూడా చెప్పానని యశస్వి వెల్లడించాడు. “గత మ్యాచ్‍లో నాదే పొరపాటు. రుతురాజ్‍కు సారీ కూడా చెప్పా. అతడు నా పొరపాటును అంగీకరించాడు. ఆటలో ఇవన్నీ జరుగుతుంటాయని అన్నాడు. రుతుభాయ్ చాలా దయతో ఉంటాడు. చాలా కేరింగ్. నాకు చాలా మద్దతు ఇస్తుంటాడు” అని యశస్వి చెప్పాడు.
తొలి టీ20లో మొదటి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఆడకుండానే డైమండ్ డక్ అయ్యాడు. తొలి ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీసిన తర్వాత.. రుతురాజ్‍ను రెండో పరుగుకు పిలిచాడు యశస్వి. దీంతో రుతురాజ్ చాలా ముందుకు వచ్చేశాడు. ఆ సమయంలో యశస్వి రన్‍కు రాకుండా ఆగిపోయాడు. రుతురాజ్‍ను వెనక్కి వెళ్లాలని చెప్పాడు. అయితే, అప్పటికే అతడు మధ్యలోకి వచ్చేశాడు. దీంతో రుతురాజ్ రనౌట్ అయి నిరాశగా వెనుదిరిగాడు. అయితే, ఆదివారం జరిగిన రెండో టీ20లో రుతురాజ్ కూడా అర్ధ శతకంతో అదరగొట్టాడు.
తాను భయం లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని యశస్వి అన్నాడు. ఫిట్‍నెస్‍ను మరింత మెరుగుపరుచుకునేందుకు కష్టపడ్డానని చెప్పాడు.
యశస్వి జైస్వాల్ మెరుపు అర్ధ శతకానికి తోడు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు.. రింకూ సింగ్ మెరుపు బ్యాటింగ్‍తో రెండో టీ20లో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 9 వికెట్లకు 191 పరుగులు చేయగలిగింది.
ఆస్ట్రేలియాతో రెండో టీ20లోనూ గెలిచిన టీమిండియా.. ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 రేపు (నవంబర్ 28) గౌహతిలో జరగనుంది.
సంబంధిత కథనం