England XI vs India: ఆండర్సన్ మళ్లీ వచ్చాడు.. రెండో టెస్టుకు రెండు మార్పులు చేసిన ఇంగ్లండ్
England XI vs India: ఇండియాతో విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టుకు సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి ఇంగ్లండ్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ టెస్టుకు ఆ టీమ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
England XI vs India: టీమిండియాపై హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో అనూహ్య విజయంతో ఊపు మీదున్న ఇంగ్లండ్ రెండో టెస్టుకు కూడా ఒక రోజు ముందే తుది జట్టును అనౌన్స్ చేసింది. ఈ మ్యాచ్ శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి విశాఖపట్నంలో జరగనున్న విషయం తెలిసిందే.
ఈ టెస్టు కోసం రెండు మార్పులు చేసిన ఇంగ్లండ్ టీమ్.. సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక షోయబ్ బషీర్ కెరీర్లో తొలి టెస్టు ఆడబోతున్నాడు.
ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఇండియన్ టీమ్ ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. రెండో టెస్టుకు తుది జట్టులో రెండు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ లో అంతగా ప్రభావం చూపని పేస్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను తీసుకుంది. ఇక సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా దూరమవడంతో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కు అవకాశం కల్పించింది.
వీసా ఆలస్యం కావడంతో బషీర్ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో టామ్ హార్ట్‌లీ ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేయగా.. ఇప్పుడు బషీర్ కు ఆ అవకాశం దక్కనుంది. తొలి మ్యాచ్ లోనే 9 వికెట్లతో హార్ట్‌లీ చెలరేగాడు. బషీర్ కూడా ఇప్పటి వరకూ కెరీర్లో కేవలం 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లే ఆడాడు. 20 ఏళ్ల బషీర్ గతేడాది కౌంటీల్లో అలిస్టర్ కుక్ కు వేసిన స్పెల్ చూసి అతన్ని జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్ బెన్ స్టోక్స్.
విశాఖపట్నం నెట్స్ లోనూ ఇంగ్లండ్ బ్యాటర్లను బషీర్ తన స్పిన్ బౌలింగ్ తో ఇబ్బంది పెట్టాడట. దీంతో కోహ్లి, రాహుల్ లాంటి సీనియర్లు లేని ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ ను అతడు ఇబ్బంది పెడతాడని ఇంగ్లండ్ ఆశతో ఉంది. మరోవైపు సీనియర్ పేస్ బౌలర్ ఆండర్సన్ తిరిగి రావడం కూడా ఇంగ్లండ్ బలాన్ని పెంచేదే. ఇక ఇంగ్లండ్ లో మిగిలిన 9 మంది ప్లేయర్స్ తొలి టెస్టు ఆడినవాళ్లే ఉన్నారు.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ టీమ్ ఇదే
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
టీమిండియా పరిస్థితి ఏంటి?
తొలి టెస్టులో అనూహ్యంగా ఇంగ్లండ్ చేతుల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇండియన్ టీమ్ కు కేఎల్ రాహుల్, జడేజా అందుబాటులో లేకుండా పోవడం మరింత చిక్కుల్లో పడేసింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరే ఇండియన్ టీమ్ తరఫున టాప్ స్కోరర్లుగా నిలిచారు.
వీళ్ల స్థానంలో తుది జట్టులోకి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ లలో ఒకరు టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నారు. ఇక జడేజా స్థానంలో కుల్దీప్ జట్టులోకి రావడం ఖాయం. అయితే బ్యాటింగ్ లైనపే కాస్త కలవరపెడుతోంది. కోహ్లి, రాహుల్ లేకపోవడంతో రోహిత్, శ్రేయస్ అయ్యర్ లపై మరింత భారం పడనుంది.