IND vs ENG 2nd Test: వైజాగ్ స్టేడియంలో టీమిండియా రికార్డులు ఇవే - హ్యాట్రిక్ విజయం దక్కుతుందా?
IND vs ENG 2nd Test: వైజాగ్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ శుక్రవారం నుంచి మొదలుకానుంది. వైజాగ్ స్టేడియం టీమిండియాకు కలిసివచ్చింది. ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా రికార్డ్ విజయాల్ని దక్కించుకున్నది.
IND vs ENG 2nd Test: ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా, ఇంగ్లండ్ జట్లు వైజాగ్ చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. తొలి టెస్ట్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా సెకండ్ టెస్ట్‌లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఫస్ట్ టెస్ట్‌లో ఓటమి అంచులో ఉన్న ఇంగ్లండ్ పోరాడి గెలిచింది ఇంగ్లండ్. రెండో టెస్ట్‌లో ఆ జోరును కొనసాగించాలని భావిస్తోంది.
రెండు విజయాలు...
వైజాగ్ స్టేడియం టీమిండియాకు కలిసివచ్చింది. ఇక్కడ ఇప్పటివరకు రెండు టెస్ట్‌లు ఆడిన టీమిండియా రెండింటిలో విజయం సాధించింది. అందులోనూ ఈ స్టేడియంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన అనుభవం టీమిండియాకు ఉంది. 2016లో ఇంగ్లండ్‌తో ఇండియా ఫస్ట్ టైమ్ వైజాగ్‌లో తలపడింది. ఈ ఈ మ్యాచ్‌లో 246 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ చిత్తయింది. ఈ టెస్ట్‌లో విరాట్ కోహ్లి 167 పరుగులతో చెలరేగాడు. అశ్విన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఐదు, సెకండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్‌కు కోహ్లి దూరమయ్యాడు. మూడో టెస్ట్ నుంచి అతడు అందుబాటులోకి రానున్నాడు.
రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు...
ఆ తర్వాత 2019లో వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డే తరహాలో చెలరేగి ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 176, సెకండ్ ఇన్నింగ్స్‌లో 127 రన్స్ చేసి బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అశ్విన్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్‌తో రెండోసారి జరుగనున్న మ్యాచ్‌తో టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. రోహిత్‌శర్మ, అశ్విన్ మరోసారి సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అశ్విన్ స్పిన్‌తో చెలరేగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. సౌతాఫ్రికాపై సాధించిన రెండు సెంచరీల రికార్డును రోహిత్ ఇంగ్లండ్ మ్యాచ్‌లో పునరావృతం చేయాలని ఫ్యాన్స్ ఆశపడుతోన్నారు.
శుభ్‌మన్‌గిల్ స్థానంలో…
రెండో టెస్ట్ టీమిండియా బ్యాటింగ్‌లో భారీగా మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్, జడేజా దూరమవ్వడం జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. హైదరాబాద్ టెస్ట్‌లో శుభ్‌మన్‌గిల్ దారుణంగా విఫలమయ్యాడు. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌ఖాన్, జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మహ్మద్ సిరాజ్ ప్లేస్‌లో ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లలో ఒకరిని ఎంపికచేయాలనే ఆలోచనలో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.