తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Bangladesh 1st Test: చెన్నై టెస్టులో రెండో రోజే 17 వికెట్లు.. విజయంపై కన్నేసిన టీమిండియా

India vs Bangladesh 1st Test: చెన్నై టెస్టులో రెండో రోజే 17 వికెట్లు.. విజయంపై కన్నేసిన టీమిండియా

Hari Prasad S HT Telugu

20 September 2024, 17:27 IST

google News
    • India vs Bangladesh 1st Test: చెన్నై టెస్టు రెండో రోజే ఏకంగా 17 వికెట్లు నేలకూలాయి. టీమిండియా ఈ మ్యాచ్ లో విజయంపై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సంపాదించిన ఇండియన్ టీమ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 81 రన్స్ చేసింది.
చెన్నై టెస్టులో రెండో రోజే 17 వికెట్లు.. విజయంపై కన్నేసిన టీమిండియా
చెన్నై టెస్టులో రెండో రోజే 17 వికెట్లు.. విజయంపై కన్నేసిన టీమిండియా (AP)

చెన్నై టెస్టులో రెండో రోజే 17 వికెట్లు.. విజయంపై కన్నేసిన టీమిండియా

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజే టీమిండియా విజయంపై కన్నేయడం గమనార్హం. తొలి రోజు లంచ్ తర్వాత కాస్త బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్.. రెండో రోజు పూర్తిగా బౌలర్లకే అనుకూలించింది. దీంతో ఇండియా, బంగ్లాదేశ్ కలిపి మొత్తంగా 17 వికెట్లు నేలకూలాయి. ప్రస్తుతం మొత్తంగా 308 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇండియన్ టీమ్.. మ్యాచ్ పై పట్టు బిగించింది.

శుభ్‌మన్ గిల్ షో

బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌట్ చేసి.. తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల ఆధిక్యం సంపాదించింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లోనూ ఓపెనర్లు రోహిత్ శర్మ (5), యశస్వి (10) వికెట్లను త్వరగా కోల్పోయినా.. మూడో స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు. అతడు విరాట్ కోహ్లితో (17)తో కలిసి మూడో వికెట్ కు 39 రన్స్, నాలుగో వికెట్ కు రిషబ్ పంత్ (12 నాటౌట్)తో కలిసి అజేయంగా 14 పరుగులు జోడించాడు.

దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీమ్ 3 వికెట్లకు 81 రన్స్ చేసింది. గిల్ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుంటే ప్రస్తుతం మొత్తంగా టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రెండో రోజు.. 17 వికెట్లు..

చెన్నై టెస్ట్ రెండో రోజు ఆట మొత్తం ఆసక్తికరంగా సాగింది. 6 వికెట్లకు 339 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియన్ టీమ్ 376 పరుగులకు ఆలౌటైంది. అంటే రెండో రోజు మరో 37 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. హసన్ మహ్మూద్ 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా 4 వికెట్లు, సిరాజ్, ఆకాశ్‌దీప్, జడేజా తలా రెండేసి వికెట్లు తీసుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబల్ హసన్ మాత్రమే 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఇండియాకు 227 పరుగుల లీడ్ వచ్చింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఇండియా కూడా రెండో రోజే మూడు వికెట్లు కోల్పోయింది. అంటే మొత్తంగా రెండో రోజు రెండు జట్లవి కలిపి 17 వికెట్లు పడటం గమనార్హం. ఈ లెక్కన మూడో రోజు నుంచి చెన్నై పిచ్ పై బ్యాటింగ్ మరింత కఠినంగా మారే అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాకు 308 పరుగుల ఆధిక్యం ఉండటంతో ఈ మ్యాచ్ లో రోహిత్ సేన విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం