IND vs AUS 3rd Test Day 3: గబ్బాలో మూడోరోజూ టీమిండియాకి తప్పని నిరాశ.. పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసిన టాప్ ఆర్డర్
16 December 2024, 14:08 IST
India vs Australia 3rd Test Day 3: గబ్బా టెస్టుకి వరుణుడు పదే పదే అడ్డుపడుతున్నాడు. మరోవైపు భారత్ జట్టు బౌలర్లు ఆదివారం తేలిపోగా.. ఈరోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో మ్యాచ్‌పై ఆస్ట్రేలియాకి పట్టుచిక్కింది.
గబ్బా టెస్టులో కష్టాల్లో టీమిండియా
ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మ్యాచ్‌లో మూడో రోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 51/4తో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33 బ్యాటింగ్: 64 బంతుల్లో 4x4), రోహిత్ శర్మ (0 బ్యాటింగ్: 6 బంతుల్లో) ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. భారత్ జట్టు ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. వర్షం, వెలుతురులేమి కారణంగా ఈరోజు దాదాపు రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది.
6 వికెట్లు పడగొట్టిన బుమ్రా
మ్యాచ్‌లో మూడో రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 405/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. తొలి సెషన్‌లోనే 445 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో ఈరోజు అలెక్స్ క్యారీ 70 పరుగులు చేయగా.. నిన్న ట్రావిస్ హెడ్, స్టీవ్‌స్మిత్ శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. భారత్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 6 వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు, అక్షదీప్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.
సింగిల్ డిజిట్‌కే టాప్ ఆర్డర్
ఆస్ట్రేలియా ఆలౌట్ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టుకి ఆరంభం నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. యశస్వి జైశ్వాల్ (4), శుభమన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) వరుసగా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయారు.
వర్షంతో రాహుల్ ఇబ్బంది
ఒకవైపు వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు వర్షం కూడా టీమిండియాను ఇబ్బంది పెట్టింది. దాంతో క్రీజులోని కేఎల్ రాహుల్ కూడా ఏకాగ్రతతో ఆడటానికి ఇబ్బందిపడుతూ కనిపించాడు. రాహుల్‌తో పాటు ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. కానీ.. గత మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైన విషయం తెలిసిందే.
సిరీస్ ప్రస్తుతం సమం
ఐదు టెస్టుల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో.. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం అయ్యింది.