తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shami Injury Update: మహ్మద్ షమీ గాయంపై ఎట్టకేలకి పెదవి విప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌పై క్లారిటీ

Shami Injury Update: మహ్మద్ షమీ గాయంపై ఎట్టకేలకి పెదవి విప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా టూర్‌పై క్లారిటీ

Galeti Rajendra HT Telugu

15 October 2024, 15:00 IST

google News
  • Rohit Sharma: మహ్మద్ షమీ గాయం గురించి గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా స్పందించని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకి బుధవారం క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్‌కి షమీ వెళ్తాడా వెళ్లడా అనే సందేహాలకీ తెరపడింది. 

మహ్మద్ షమీ గాయంపై కెప్టెన్ రోహిత్ క్లారిటీ
మహ్మద్ షమీ గాయంపై కెప్టెన్ రోహిత్ క్లారిటీ (X)

మహ్మద్ షమీ గాయంపై కెప్టెన్ రోహిత్ క్లారిటీ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంపై ఎట్టకేలకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌ఏసీ)లో గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో మళ్లీ షమీ గాయపడ్డాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలను షమీతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ ఖండిస్తూ వచ్చింది. అయితే.. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా షమీ గాయం గురించి క్లారిటీ ఇచ్చాడు.

భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం (అక్టోబరు 16)న బెంగళూరు వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో మహ్మద్ షమీ గాయం గురించి కూడా ప్రశ్న ఎదురైంది. దాంతో రోహిత్ శర్మ నిజం చెప్పక తప్పలేదు.

ఉబ్బిన షమీ మోకాలు

‘‘నిజం చెప్పాలంటే మహ్మద్ షమీ మళ్లీ గాయపడ్డాడు. గాయం కారణంగా అతని మోకాలు ఉబ్బిపోయింది. దాంతో అతను ప్రస్తుతం ఎన్‌సీఏలోనే ఉంటూ వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో మళ్లీ ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేని షమీని నవంబరులో ఆస్ట్రేలియా టూర్‌కి తీసుకెళ్లడం మాకు ఇష్టం లేదు’’ అని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.

భారత్ తరఫున ఇప్పటి వరకు 64 టెస్టులాడిన షమీ 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. రోహిత్ శర్మ మాటల్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా టూర్‌కి షమీ వెళ్లడం అనుమానమే.

నవంబరు నుంచి ఆటకి దూరం

మహ్మద్ షమీ చివరిగా 2023 నవంబర్‌లో ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ చాలా రోజులు నుంచి ఆటకి దూరంగా ఉండిపోయాడు. అయితే ఇటీవల నెట్స్‌ అతను బౌలింగ్ చేస్తున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి. అయితే.. రిహాబిలిటేషన్ సమయంలోనే మరోసారి అతను గాయపడ్డాడు. షమీ గాయం తీవ్రత దృష్ట్యా అతను కోలుకోవడానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అందుకే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి షమీ అందుబాటులో ఉండడని రోహిత్ శర్మ సంకేతాలిచ్చాడు.

షమీ కోసం రోడ్ మ్యాప్ రెడీ

‘‘మోకాలి గాయం నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ చాలా కష్టం. ఇప్పటికే షమీ చాలా క్రికెట్‌ను కోల్పోయాడు. కానీ అతను కోలుకోవడానికి, 100 శాతం ఫిట్‌నెస్ సాధించడానికి తగినంత సమయం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఫిజియో, ట్రైనర్, డాక్టర్లు అతని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లను షమీ ఆడాల్సి ఉంటుంది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మహ్మద్ షమీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌కి అవకాశాలు దక్కుతున్నాయి. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆకాశ్ దీప్ నిలకడగా రాణించాడు. దాంతో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కి కూడా అతడ్ని సెలెక్టర్లు ఎంపిక చేశారు.

తదుపరి వ్యాసం