Rohit Sharma: టీమిండియాలో ధోనీ సంప్రదాయాన్ని కొనసాగించిన రోహిత్ శర్మ.. ఆకాశ్ చేతికి ట్రోఫీ
India vs Bangladesh 2024: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ గెలిచిన భారత్ జట్టు.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానాన్ని పదిలం చేసుకుంది. రెండు టెస్టుల్లోనూ బంగ్లాదేశ్ కనీస పోటీని కూడా టీమిండియాకి ఇవ్వలేకపోయింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ టెస్టు జట్టు మంగళవారం బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసింది. ఇటీవల చెన్నై వేదికగా ముగిసిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. దాంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది.
సిరీస్ ట్రోఫీని సగర్వంగా అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ ట్రోఫీని తీసుకొచ్చి తొలుత యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ చేతికి అందించాడు. టీమ్‌లోకి కొత్తగా వచ్చిన ప్లేయర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ట్రోఫీని మొదటి వారి చేతికివ్వడం గత కొన్నేళ్లుగా భారత్ జట్టులో కొనసాగుతోంది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ సంప్రదాయానికి బీజం వేయగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘకాలం దీన్ని కొనసాగించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు.
రోహిత్ శర్మ కేవలం మాట్లాడటమే కాదు మైదానంలో ఏం చెబుతున్నాడో అది చేతల్లో చూపిస్తాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాన్పూర్ టెస్టులో వర్షం, వెలుతురులేమి, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో రెండన్నర రోజు ఆట వృథా అయ్యింది. దాంతో టీ20 తరహాలో హిట్టింగ్ చేయాలని టీమ్‌కి చెప్పిన రోహిత్ శర్మ.. తాను కూడా క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్ ఝళిపించి టీమ్‌కి ఆదర్శంగా నిలిచాడు.
వాస్తవానికి కాన్పూర్ టెస్టు మ్యాచ్ డ్రా అవుతుందని అంతా అంచనా వేశారు. కానీ.. రోహిత్ శర్మ తన కెప్టెన్సీ ప్రతిభతో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను అటాకింగ్ బౌలింగ్‌తో కట్టడి చేయడం, హిట్టింగ్‌తో భారత్ జట్టు మెరుగైన స్కోరును నమోదు చేయడం ఇవన్నీ టీమిండియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాయి.
కెప్టెన్సీ, బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పే సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్‌ను రోహిత్ శర్మ పట్టాడు. భారత్ జట్టు ఈ ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లను ఆడనుండగా.. బంగ్లాదేశ్‌పై ఘన విజయాలు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి.