తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Playing Xi Vs Bangladesh: చెన్నై టెస్టుకి భారత్ తుది జట్టుపై గంభీర్ హింట్.. ఆ ఇద్దరికీ తప్పని నిరాశ!

India Playing XI vs Bangladesh: చెన్నై టెస్టుకి భారత్ తుది జట్టుపై గంభీర్ హింట్.. ఆ ఇద్దరికీ తప్పని నిరాశ!

Galeti Rajendra HT Telugu

18 September 2024, 15:22 IST

google News
  • IND vs BAN 1st Test: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న తొలి టెస్టుకి భారత్ తుది జట్టుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దాదాపు క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకి తెరపడినట్లు అయ్యింది. 

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (PTI)

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

Gautam Gambhir: బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గురువారం (సెప్టెంబరు 19)న జరగనున్న తొలి టెస్టులో భారత్ తుది జట్టుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దాదాపుగా క్లారిటీ ఇచ్చేశాడు. మ్యాచ్ ముంగిట చెపాక్ స్టేడియంలో మీడియాతో మాట్లాడిన గంభీర్.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆసక్తికర చర్చకి తెరదించాడు.

తొలి టెస్టులో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , రిషబ్ పంత్‌లో ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం లభించనుండగా.. ఆ ఇద్దరూ ఎవరు అనేదాని గత కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. దాంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన గౌతమ్ గంభీర్.. సీనియర్లకే మొగ్గు చూపాడు.

ఆ ఇద్దరూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం

ఇంగ్లాండ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. రాంచీ, ధర్మశాల టెస్టుల్లో అర్ధశతకాలతో సత్తాచాటాడు. పేస్, స్పిన్నర్లని ఆ సిరీస్‌లో సర్ఫరాజ్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితంకానున్నాడు. డిసెంబరులో కీలకమైన బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం భారత్ జట్టు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్‌కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు గంభీర్ వెల్లడించాడు.

యంగ్ వికెట్ కీపర్ జురెల్ గురించి కూడా ఇదే అభిప్రాయాన్ని గంభీర్ వ్యక్తం చేశాడు, ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రాంచీ టెస్టు మ్యాచ్‌లో జురైల్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. కానీ 2022లో కారు ప్రమాదానికి గురై.. జట్టుకు దూరమైన తర్వాత రిషబ్ పంత్ ఇప్పుడు టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో జురైల్‌ నిరీక్షించక తప్పదని గంభీర్ చెప్పుకొచ్చాడు.

రొటేషన్‌లో ఛాన్స్ ఇస్తాం

తొలి టెస్టుకి తుది జట్టు ఎంపిక గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘‘మేం ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్‌కి సరిపోయే ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. కానీ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ టీమ్‌లోకి వచ్చినప్పుడు వేచి చూడక తప్పదు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇదే సూత్రం. కేఎల్ రాహుల్ రావడంతో అతను నిరీక్షించక తప్పదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

భారత టెస్టు జట్టుకి సుదీర్ఘ టెస్టు సీజన్ ఉన్నందున ఆటగాళ్లను టీమ్‌లో రొటేట్ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించబోతున్నట్లు గంభీర్ వెల్లడించాడు. ఈ క్రమంలో యువ ఆటగాళ్లకు కచ్చితంగా అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డాడు.

ప్లేయింగ్ ఎలెవన్ సెట్?

తుది జట్టు వివరాల్ని పూర్తి స్థాయిలో గౌతమ్ గంభీర్ చెప్పకపోయినా.. అతను మాటల్ని బట్టి దాదాపు క్లారిటీ వచ్చేసింది. భారత బ్యాటింగ్ లైనప్ కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ‌లతో టాప్ ఆర్డర్ ఫిక్స్.

ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, 6వ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు టీమ్‌లో ఉంటారు.

ఇక క్లారిటీ రావాల్సింది ఒక్క ఐదో బౌలింగ్ ఆప్షన్ విషయంలోనే. ఈ స్థానం కోసం అక్షర్ పటేల్, ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ దీప్, యశ్ దయాళ్ కంటే కుల్దీప్ యాదవ్ ముందు వరుసలో ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

తదుపరి వ్యాసం