Womens T20 World Cup Team: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో భారత ప్లేయర్‌కి చోటు, సెమీస్‌కి చేరలేకపోయినా గౌరవం
22 October 2024, 7:00 IST
Harmanpreet Kaur: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2024లో కనీసం సెమీస్ చేరకుండానే భారత్ జట్టు నిష్క్రమించడంతో అత్యంత ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్. కానీ హర్మన్‌కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్
భారత మహిళల క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల యూఏఈ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్-2024 ముగియగా.. భారత్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే లీగ్ దశలో ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ విశ్వవిజేత
టోర్నీలో భారత్ జట్టు విఫలమైనా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. దాంతో ఐసీసీ తాజాగా ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కి చోటు దక్కించుకుంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ టోర్నీలో విజేతగా నిలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సోపీ డివైన్‌కి ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.
బ్యాట్‌తో సత్తాచాటిన హర్మన్
భారత్ తరఫున టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన హర్మన్ రెండు హాఫ్ సెంచరీలతో 150 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 133.92గా ఉండటం విశేషం. దాంతో ఐసీసీ ప్రకటించిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌కి చోటు దక్కింది. కానీ.. పాకిస్థాన్ జట్టు నుంచి ఒక్క ప్లేయర్‌కి కూడా ఈ టీమ్‌లో స్థానంలో దక్కలేదు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జట్టు
లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా, కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా), డానీ వాట్ హాడ్జ్ (ఇంగ్లాండ్), మెల్లి కెర్ (న్యూజిలాండ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్), డీండ్రా డాటిన్ (వెస్టిండీస్), నిగర్ సుల్తానా జోతి (బంగ్లాదేశ్, వికెట్ కీపర్), అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), రోజ్మేరీ మేయర్ (న్యూజిలాండ్), నోన్కులులేకో మ్లాబా (దక్షిణాఫ్రికా), మెగాన్ స్కట్ (ఆస్ట్రేలియా). 12వ ప్లేయర్: ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్)
టోర్నీలో భారత్ జర్నీ
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు జర్నీ అంత సాఫీగా జరగలేదు. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచి పుంజుకున్నట్లు కనిపించినా.. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దాంతో భారత్ జట్టు కనీసం సెమీస్ చేరకుండానే గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.